దావోస్ వేదిక‌గా...ప్ర‌తిష్టాత్మ‌క 50వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో టెక్నాలజీ ప్రయోజనాలు- ఎదురయ్యే సవాళ్లపై చర్చ జరుగనుంది. ప్ర‌తిష్టాత్మ‌క వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో పాల్గొనడానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్నారు. సోమవారం ప్రారంభమైన నాలుగో పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక ప్రయోజనాలు- సవాళ్లను నివారించడం అనే అంశంపై మంత్రి కేటీఆర్‌ ప్రసంగించ‌నున్నారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రగతిని వివరిస్తారు. సమావేశాల సందర్భంగా ప్రపంచదేశాలకు చెందిన అనేకమంది పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీకానున్నారు. రాష్ట్రంలో ఫార్మాసిటీ, టెక్స్‌టైల్‌ పార్క్‌, జీనోమ్‌ వ్యాలీ, మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌, కృత్రిమ మేధ, ఎలక్ట్రానిక్‌ సహా పలురంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.

 

అయితే, ఇదే స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర రీతిలో కేటీఆర్ రియాక్ట‌య్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొనడానికి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. సోమవారం అక్కడినుంచే ఫోన్‌లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచార సరళి, ఓటింగ్‌కు సంసిద్ధతపై పార్టీ నాయకులతో సమీక్షించారు. పోలింగ్‌కు మరో 36 గంటలు మాత్రమే ఉన్నందున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు అంతా అప్రమత్తంగా ఉండి పార్టీ గెలుపునకు కృషిచేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పోలింగ్‌కు ముందు పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. పోలింగ్‌ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో పార్టీ ఏజెంట్‌ కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అతి తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నందున ప్రతి ఓటు విలువైనదేనని, అందరూ ఓటింగ్‌కు వచ్చేలా చూడాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌, మేయర్‌ ఎన్నికలు జరుగనున్నందున విప్‌ ఫాంలు ఎమ్మెల్యేలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

 

రాష్ట్రంలోని పట్టణ ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తరఫున పురపాలక ఎన్నికలకు బాధ్యత వహిస్తున్న సీనియర్‌ నాయకులు, మున్సిపల్‌ ఎన్నికల ఇంచార్జీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులకు పలు ఆదేశాలు జారీచేశారు. పార్టీచేసిన అభివృద్ధి, స్థానిక పట్టణాల్లోని వార్డుల్లో చేపట్టనున్న కార్యక్రమాల ఎజెండా ప్రకటించి పుర ఎన్నికల ప్రచారపర్వంలో టీఆర్‌ఎస్‌ ముందున్నదని కేటీఆర్‌ చెప్పారు. అభివృద్ధే ఎజెండాగా ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతి ఎన్నికల్లో ప్రజల నుంచి లభించిన సానుకూల స్పందన, ఆశీర్వాదం, విజయాల మాదిరిగానే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఘనవిజయం సిద్ధిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు కేవలం దుష్ప్రచారం, దూషణలు, అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశాయని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: