అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పదిమంది నేతల్లో,  ఒకరిగా ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీనే లెక్కచేయని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... ఇప్పుడు దేశంలోనే అత్యంత బలమైన బిజెపిని కూడా బేఖాతరు చేశారు. స్వయంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చి తానేంటో చాటి చెప్పారు. జగన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని తూనా బొడ్డు అని.. తాను అనుకున్నదే అమలు చేసి చూపించారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చుతూ అసెంబ్లీలోనే తీర్మానం ఆమోదించారు.151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల బలంతో.. మహాబలశాలిగా ఉన్న జగన్ కేంద్రంలోని బిజెపి మాట వింటారని అనుకోవడమే తప్పు.

సోనియానే ధిక్కరించిన జగన్ మనస్తత్వం గురించి తెలిసిన వారెవయినా, మోదీకి భయపడతారనుకోవడం వెర్రితనం. మరి శాసన రాజధానిని అమరావతిలోనే ఉంచాలన్న బిజెపి రాష్ట్ర కమిటీ తీర్మానం, అక్కడ నుంచి అరడుగు కూడా రాజధానిని తరలించరలేరన్న నేతలు చేసిన పత్రికా ప్రకటనలు బజ్జీ పొట్లాలు కట్టుకోవడానికేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.  రాష్ట్రంలో బిజెపికి నయాపైసా బలం లేకపోయినా, నాయకుల సంఖ్యకు తక్కువేమీ లేదు. వాస్తవానికి  రాజధానిపై వారిది తలా ఒక వాదన వ్యక్తమవుతోంది.

 తలా ఒక దారి అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అలాంటి పరిస్థితిని చక్కదిద్ది, అందరినీ ఒక తాటిపైకి తెచ్చి, అమరావతే రాజధాని అని తీర్మానించేసరికి  నాయకత్వానికి తాడు తెగినంత పనయిందంటూ   కమలశ్రేణులు పేర్కొంటున్నారు. మరి రాష్ట్ర శాఖ తీర్మానం చేసింది కాబట్టి, కేంద్ర పార్టీ దానికి అనుగుణంగా వ్యవహరించి.. రాష్ట్ర పార్టీ పరువు నిలబెట్టే పనేమైనా చేసేందుకు ప్రయత్నించిందా అంటే అదీ లేదు. అక్కడ కూడా ఎవరి దుకాణాలు వారివే. ఎవరి గ్రూపులు వారివే. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలంతా రాజధాని తరలింపుపై ఒకేమాటపై ఉండాలని ఆదేశిస్తూ,  అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ బిజెపి రాష్ట్ర శాఖ ఓ తీర్మానం ఆమోదించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: