ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ అత్యవసర సమావేశాలు ఉత్కంఠ భ‌రితంగా మారాయి. స‌మావేశాల్లో భాగంగా తొలి రోజైన సోమవారం అధికార, విపక్ష నేతలు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు మధ్య ఆసక్తికరమైన మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతి సవాళ్లు, విజ్ఞప్తులు, చేతులు జోడించి దండాల పెట్టే వరకు వెళ్లి ఎట్ట‌కేల‌కు రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ బిల్లు ఆమోదం పొందిన సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన శాసనసభ రాత్రి 11గంటల వరకు కొనసాగి ఆమోదం పొందిన ఏపీ రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ బిల్లు శాస‌న మండ‌లికి చేరింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లు కౌన్సిల్‌కు చేర‌గా ఇక్క‌డ టీడీపీ వేసే ఎత్తుల‌పై ఉత్కంఠ నెల‌కొంది.

 

 

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఏపీలో మూడు రాజధానులు .. నాలుగు ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందించుకున్న సంగ‌తి తెలిసిందే. కీలకమైన బిల్లులను ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టి స‌వివ‌ర చ‌ర్చ‌, ఉత్కంఠత‌ నడుమ నెగ్గించుకున్నారు. అయితే, ఈ బిల్లుల‌కు అస‌లు ప‌రీక్ష ఇప్పుడు ఎదురుకానుంద‌ని స‌మాచారం. కీల‌క‌మైన పెద్ద‌ల స‌భ‌లో అధికార వైసీపీకి షాక్ ఇవ్వాల‌ని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. బిల్లుల‌ను అడ్డుకొని త‌మ స‌త్తా చాటాల‌ని ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. ఇందుకు సాంకేతికంగా కూడా అవ‌కాశం ఉండ‌టంతో ఉత్కంఠ నెల‌కొంది. 

 

అధికార పక్షానికి మండలిలో మెజార్టీ లేకపోవడంతో... ఎలాగైనా బిల్లును అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. శాసనమండలిలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీల ఉండగా.. టీడీపీ నుంచి 34 మంది, వైసీపీ నుంచి 09, పీడీఎఫ్‌ నుంచి 06, స్వతంత్రులు ముగ్గురు, బీజేపీ ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒక్కరు ఉన్నారు. మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాగా, చర్చను పూర్తి స్థాయిలో జరపడం ద్వారా జాప్యం చేయాలనే ఎత్తుగడలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే యోచనలో ప్రతిపక్ష టీడీపీ ఉన్నట్టు స‌మాచారం. సెలెక్ట్ కమిటీకి పంపడం ద్వారా నెలల పాటు బిల్లును పెండింగులో పెట్టొచ్చనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష వ్యూహాలను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సార‌థ్యంలోని అధికార ప‌క్షం ఎలా చిత్తు చేస్తుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: