ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు సభ నుండి వాకౌట్ చేయటం చూసుంటారు.  కానీ అసెంబ్లీ స్పీకరే సభ నుండి వాకౌట్ చేయటం ఎక్కడైనా విన్నారా ? మంగళవారం అసెంబ్లీ నుండి స్పీకర్ తమ్మినేని సీతారామ్ వాకౌట్ చేయటం సంచలనంగా మారింది.  మూడు రాజధానుల ప్రతిపాదనకు చట్టం రూపం ఇవ్వటానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

 

మంగళవారం ఉదయం రెండోరోజు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి సభలో గందరగోళం జరుగుతునే ఉంది. సభ మొదట్లోనే టిడిపి సభ్యులు స్పీకర్ ను ఉద్దేశించి బ్యామ్ మర్నింగ్ చెప్పటంతో సమావేశాలు మొదలయ్యాయి.  అమరావతిని రాజధానిగా మర్చటంపై నిరసనగా టిడిపి సభ్యులు సమావేశాలను అడ్డుకుంటునే ఉన్నారు.  ఉదయం ఎవరైనా గుడ్ మర్నింగ్ చెబుతారు లేకపోతే శుభోదయం చెబుతారు కానీ మీరేంటి బ్యామ్ మార్నింగ్ తో ప్రారంభిస్తున్నారంటూ స్పీకర్ చురకలు కూడా వేశారు.

 

సమావేశాలు మొదలైన కాసేపు మాత్రం సజావుగా జరిగింది. ఆ తర్వాత నుండి సభలో ఒకటే గోల మొదలైంది. ఒకవైపు మంత్రులు,   వైసిపి సభ్యులు మాట్లాడుతునే ఉన్నా మరోవైపు టిడిపి సభ్యులు మాత్రం గోల చేస్తునే ఉన్నారు. సభలో ఎస్సీ కమీషన్  సవరణలపై మంత్రులు మాట్లాడుతుంటే వినబడకుండా ప్రతిపక్షం గోల మొదలుపెట్టింది.

 

తమ సీట్లలో నుండి లేచి అరవటమే కాకుండా స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి నోటికొచ్చి నట్లు మాట్లాడటం మొదలుపెట్టారు.   సభ్యులు వెళ్ళి తమ సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఎంతసేపు చెప్పినా వినకుండా అంతకంతకూ గోల ఎక్కువ చేస్తునే ఉన్నారు. దాంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసినా టిడిపి సభ్యులు వెనక్కు తగ్గలేదు. సభలో ఇంత గోల జరుగుతున్నపుడు తాను సమావేశాలను నడపలేనని చెప్పినా పట్టించుకోలేదు.  దాంతో వేరే దారిలేక చివరకు స్పీకరే సభ నుండి వాకౌట్ చేశారు. నిజానికి స్పీకర్ చర్య సంచలనంగా మారింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: