జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో విభేదాలు బయటపడ్డాయా ?  విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం  అవుననే అనుకోవాలి. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల పై మంత్రివర్గంలో అందరి అభిప్రాయాలు చెప్పమని సిఎం అడిగారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు   చట్టరూపం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే అధికార పార్టీ మూడు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు  మొదలైన విషయం తెలిసిందే.

 

సరే అధికార వికేంద్రీకరణ, రాష్ట్రాభివృద్ధి చట్టం-2020, సిఆర్డీఏ చట్టం రద్దు తదితరాలను క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.  అలాగే రాజధాని రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, పెంచాల్సిన కౌలు కాల పరిమితి తదితరాలపైన కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదించింది.

 

అంతా అయిన తర్వాతే అసలు విషయం మొదలైంది. అదేమిటంటే రాజధానిని విశాఖపట్నంకు తరలిస్తున్నట్లు అందరికీ అర్ధమైపోయింది. అలాగే  శాసనసభ, మండలి సమావేశాలు ఎక్కడ జరగాలి ? అనే విషయాలపై చర్చ మొదలైంది.  కొందరు మంత్రులు మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయాలు విశాఖపట్నంతో పాటు  అమరావతిలో కూడా కంటిన్యు అవ్వాలని చెప్పారట. అయితే ఇదే విషయమై మరికొందరు మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం.

 

రెండు చోట్ల ముఖ్యమంత్రి కార్యాలయాలు ఉన్నందు వల్ల ఖర్చు తప్ప పెద్దగా ఉపయోగాలు ఉండవని చెప్పారట. కాబట్టి సిఎం కార్యాలయం విశాఖపట్నంలో ఉంటేనే మంచిదని అన్నారట.  అలాగే శాసనసభను అమరావతిలో మాత్రమే ఉంచి అసెంబ్లీ సమావేశాలన్నింటినీ అమరావతిలో మాత్రమే నిర్వహించాలని కొందరు మంత్రులు సూచించారట. అయితే మరికొందరు మంత్రులు మాట్లాడుతూ అమరావతితో పాటు  విశాఖపట్నంలో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తేనే బాగుంటుందన్నారట.

 

కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయటాన్ని మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు కానీ సచివాలయం, అసెంబ్లీ, సిఎం కార్యాలయం ఏర్పాటులో మాత్రం మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని సమాచారం. ఈ రెండు అంశాలపై  మంత్రులు ఎవరి వాదనకి వాళ్ళు కట్టుబడి ఉండటంతో  ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయారట. దాంతో  ఇప్పటికిప్పుడు  ఈ విషయం తెగేది కాబట్టి వెంటనే జగన్ జోక్యం చేసుకుని చర్చను వాయిదా వేశారట.  ఏం చేయాలనే విషయంలో మళ్ళీ నిర్ణయం తీసుకుందామని సిఎం చెప్పటంతో  మంత్రివర్గ సమావేశం ముగిసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: