తెలుగుదేశం పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఓ వైపు అమ‌రావ‌తి విష‌యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న త‌రుణంలో...తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ త‌న ప‌ద‌వికి గుడ్‌బై చెప్పేశారు. కీల‌క‌మైన రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ బిల్లుపై పెద్ద‌ల స‌భ అయిన శాస‌నమండలి చ‌ర్చ జ‌రుగుతున్న త‌రుణంలో...తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడుకు లేఖ రాసి మ‌రీ ఆయ‌న త‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని వీడ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప‌రిణామం టీడీపీకి ఊహించ‌ని షాక్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

చంద్ర‌బాబుకు రాసిన లేఖ‌లో డొక్కా ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు ప్ర‌స్తావించారు. `రాజ‌ధాని అమ‌రావ‌తి విడిపోతున్నందుకు బాధ‌గా ఉంది . అందుకే నేను నా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న స‌మ‌యంలో న‌న్ను ప్రోత్స‌హించారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ సైతం న‌న్ను ప్రోత్స‌హించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్రత్తిపాడు నుంచి  పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. అయితే, ఓట‌మి పాల‌యినా అక్క‌డి ప్ర‌జ‌లు నా వెంట ఉంటూ వ‌స్తున్నారు. రాజధాని విడిపోవ‌డం వారికి బాధ క‌లిగించే అంశం. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకొని రాజీనామా చేస్తున్నాను`` అని డొక్కా వెల్ల‌డించారు. 

 

కాగా, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అయిన డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంతు కావ‌డంతో టీడీపీలో చేరారు. అయితే, ఈ చేరిక‌కు ముందే  వైసీపీలో చేరేందుకు డొక్కా సిద్ధ‌మ‌ని మీడియాలో విప‌రీత‌మైన ప్ర‌చారం జ‌రిగింది.  అయితే వైసీపీలో డొక్కా  చేరికను ఆయన రాజకీయ గురువు ఎంపీ రాయపాటి సాంబ‌శివరావు అడ్డుకున్నట్లు స‌మాచారం. మ‌రోవైపు టీడీపీలో చేరాలని రాయపాటి ప్ర‌తిపాదించగా...తన రాజకీయ గురువు ఒత్తిడితో డొక్కా టీడీపీలో చేరారు.  అనంత‌రం ఆయ‌న‌కు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా తెలుగుదేశం అవ‌కాశం ఇచ్చింది. అయితే, కీల‌క‌మైన ప్ర‌స్తుత చ‌ర్చ‌ల స‌మ‌యంలో...డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా తెలుగుదేశం పార్టీకి షాక్ వంటిద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: