తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచార ఘట్టం ముగిసింది. ప్రచారంతో హోరెత్తిన మైకులు మూగబోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 120 మన్సిపాలిటీల్లో, 9 కార్పొరేషన్లలో ఈ నెల22న పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో హోరెత్తిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం.. సోమవారం  సాయంత్రం ఐదింటికి ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీలు,9 కార్పొరేషన్లలో మైకుల హోరు నిలిచిపోవడంతో.. నిశ్శబద్దం ఆవహించింది. ఈనెల 22న పోలింగ్‌ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

 

ఈ నెల 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 120 మున్సిపాలిటీల్లో 6వేల325 పోలింగ్ కేంద్రాలు,  9 కార్పొరేషన్ లలో 1586 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 53 లక్షల36 వేల 605 మంది కాగా.. అందులో పురుషులు 
26 లక్షల 71, 694 మంది, మహిళలు 26 లక్షల 64 వేల 557మంది ఉన్నారు. ఇతరులు 354 మంది ఉన్నారు. మహిళల కంటే పురుషులు 7వేల 131 మంది ఎక్కువగా ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 6 లక్షల 40 వేల మంది ఓటర్లుండగా.. అత్యల్పంగా జనగామ జిల్లాలో 39729 మంది ఓటర్లు ఉన్నారు. 

 

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో మొత్తం 2,727 వార్డుల్లో 12,898 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 69 వార్డుల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ తరపున 2972 మంది అభ్యర్థులు బరిలో నిలవగా..  కాంగ్రెస్ 2616, బీజేపీ 2313, టీడీపీ 347,  ఎంఐఎం 276,  సీపీఐ 177, సీపీఎం 166 మంది అభ్యర్థులను పోటీలో నిలిపాయి. స్వతంత్రులు 3750 మంది పోటీలో ఉన్నారు.  బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో... తెలుపు రంగు బ్యాలెట్ పత్రం వాడనున్నారు. 44 వేల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. దొంగ ఓట్లు వేయకుండా దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను వినియోగిస్తున్నారు. కొంపల్లి మున్సిపల్ పరిధిలోని 6 వార్డులు, 10 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఫేస్‌ రికగ్నైజేషన్ యాప్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో రికగ్నైజేషన్ యాప్ అమలు కోసం ప్రత్యేక పోలింగ్ అధికారిని నియమించారు. 

 

ఎన్నికల సిబ్బంది కోసం ఈసీ.. ఆన్‌లైన్‌లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది.  ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో జనవరి 22న సెలవు ప్రకటించారు. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తికాగా.. మెజార్టీ మున్సిపాలిటీల్లో ఓటర్ స్లిప్స్ పంపిణీ కూడా ముగిసింది. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పోలింగ్ ప్రక్రియ వీడియో రికార్డింగ్‌తో పాటు పోలింగ్ సరళి తెలుసుకునేందుకు వెబ్ కాస్టింగ్ కూడా చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.  ప్రసార, ప్రచార మాధ్యమాల్లో రాజకీయ పార్టీల ప్రచారాలు, బల్క్ మెసేజ్ లు పంపడం వంటివి నిషేధించారు. 

 

ఓటర్ స్లిప్పులను 'నా ఓటు' యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక, ఈనె 24న కరీంనగర్ కార్పొరేషన్ కు పోలింగ్ జరగనుంది. ఈ కార్పొరేషన్ పరిధిలో 385 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: