కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదన తర్వాత విశాఖ... తొలిసారి జాతీయ పండుగకు వేదికవుతోంది. సాగరతీరం గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం రెడీ అవుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా స్టీల్ సిటీలో పోలీసులు సెక్యూరిటీని టైట్ చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ బీచ్ రోడ్డులో సందడిగా సాగుతున్నాయి.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత తొలి ఇండిపెండెంట్స్ డే వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఆ తర్వాత మళ్లీ కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదనలు వచ్చిన తర్వాత జాతీయ పండుగకు విశాఖ నగరం అతిథ్యమిస్తోంది. వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలను సాగరతీరంలో నిర్వహిస్తోంది. ఆర్కే బీచ్ వేదికగా జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఈనెల 25 వరకూ ఆర్కే బీచ్‌లో ఉదయం, సాయంత్రం రిహార్సల్స్ జరుగుతాయి. ఇప్పటికే కొన్ని బృందాలు విశాఖకు చేరుకున్నాయి. తొలిరోజు ఆర్మ్డ్‌డ్‌ పోలీసులు, ఎన్.సి.సి, స్కౌట్, ఎక్సైజ్ విభాగాల నుంచి వచ్చిన బృందాలు ప్రాక్టీసు చేశాయి. రిపబ్లిక్ డే రోజున ఐదు ఆర్మ్ డు, మరో ఐదు నాన్ ఆర్మ్‌డ్‌ కంటింజెంట్‌లు, ఇండియన్ నేవీ బృందం పరేడ్లో పాల్గొంటాయని సిటీ పోలీస్ కమిషనర్ చెప్పారు. రిపబ్లిక్ డే ముగిసే వరకూ బీచ్ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.

 

స్టీల్ సిటీలో జరగబోయే గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లలో 14 కమిటీలు నిమగ్నమయ్యాయి. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, మంత్రి అవంతి శ్రీనివాస్ దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. వేడుకలలో పరేడ్, శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. బీచ్‌కు అభిముఖంగా త్రివర్ణపతాకాన్ని ఎగరేయడానికి ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు. మొత్తం గ్యాలరీల్లో వెయ్యి మందికి అవకాశం కల్పి౦చేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ వేడుకలను చూసేందుకు హాజరయ్యే వారికోసం బీచ్ రోడ్‌లో ప్రత్యేక గ్యాలరీలను రెడీ చేస్తున్నారు. బయటి నుంచి వీక్షించేందుకు బీచ్ రోడ్డులో ప్రత్యేక LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలను వీక్షించేందుకు వచ్చే వారి కోసం 8 చోట్ల పార్కింగ్ స్ధలాలు గుర్తించారు విశాఖ పోలీసులు.

 

మొత్తానికి...ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ప్రతిపాదన తర్వాత విశాఖలో తొలిసారిగా జరుగుతున్న వేడుకలు కావటంతో గణతంత్ర దినోత్సవానికి సిటీ పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: