కలివికోడి.. అత్యంత అరుదైన పక్షుల్లో ఒకటి. దాన్ని చూద్దామన్నా కనిపించదు. దశాబ్దం క్రితం ఓ సారి చూశామని చెబుతున్నా అక్కడ ఆధారాలు మాత్రం లేవు. దాని కోసం 30ఏళ్లుగా అన్వేషణ కొనసాగుతోంది. ఈ క‌లివికోడి ప్రాజెక్టులో ల‌క్షలాది మంది జ‌నం అల్లాడిపోతున్నారు. క‌డ‌ప జిల్లాలోని అట్లూరు వాసులు ఈ పక్షి పేరు చెబితేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

కనుమరుగవుతున్న అరుదైన పక్షిజాతుల్లో జెర్డాన్స్ కోర్సర్ ఒకటి. 19వ శతాబ్దంలో భద్రాచలం నదీపరివాహక ప్రాంతంలో ఈ పక్షి జాడ కనిపించింది. సిద్దవటం రేంజ్‌ పరిధిలో 1986 జనవరి నెలలో కలివిచెట్ల మధ్యలో ఐతన్న అనే వ్యక్తికి ఈ పక్షి దొరికింది. అయితే అది అప్పటికే చనిపోయింది. అప్పటి నుంచి దీని కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. 2008లో మరో మారు ఈ పక్షి కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. కడప జిల్లా అట్లూరు మండల పరిధిలోని కలివిచెట్ల పొదల మాటున తిరుగుతుందని పరిశోధనలలో తేలడంతో దీనిని కలివికోడిగా పిలుస్తున్నారు. దీని జాడ మన ఏపీలో వుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

 

కలివికోడి జాతి ఎప్పుడో అంతరించిపోయిందని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు నమ్ముతున్నా.. అట్లూరులో మాత్రం దాని కోసం అన్వేషణ కొనసాగుతోంది. 1986లో దొరికి చ‌నిపోయిన క‌లివికోడిని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ మ్యూజియంలో ఉంచారు. కలివికోడి జాడ కనుగొనేందుకు అట్లూరు మండల పరిధిలోని కొండూరు ఫారెస్టు కార్యాలయ ప్రాంగణంలో 2013 నవంబరు నెలలో పరిశోధనా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ పక్షి ఉనికిని కనుగొనేందుకు అమర్చిన 177 కెమెరాలలో నమోదైన దృశ్యాలను పరిశోధనా కేంద్రంలో పరిశీలిస్తున్నారు అధికారులు. అయితే 30 సంవత్సరాల నుంచి అన్వేషిస్తున్నా.. కోడి జాడ కపిపించడం లేదు. 

 

ఈ అరుదైన జాతి పక్షిని సంరక్షించేందుకు ప్రభుత్వం కడప జిల్లా అట్లూరు ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించింది. కలివికోడి ఆవాస ప్రాంతంగా 464.5  చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తించి లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంగా మార్చింది. కడప, బద్వేల్ రహదారిలో రాత్రిపూట వాహనాల రాక‌పోక‌ల‌పై ఆంక్షలు పెట్టారు. ఇదే ఈ ప్రాంత వాసుల‌కు శాపంగా మారింది. నిషేదిత ప్రాంతం నుంచి జిల్లా కేంద్రమైన క‌డ‌ప‌కు చేరుకోవడానికి అర‌గంట స‌మ‌యం స‌రిపోతుంది. రాత్రి సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యతో ఆసుప‌త్రి కోసం క‌డ‌ప‌కు వెళ్లాలంటే అధికారులు అనుమతించ‌డంలేదు. దీంతో ఇటీవ‌ల చాలా మంది ప్రాణాలు వ‌దిలారు.. 

 

కలివికోడి జాడ తెలుసుకునేందుకు దాని సంరక్షణ కోసం ఇప్పటి దాకా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 50 కోట్లకు పైనే ఖ‌ర్చు చేశాయి. కలివికోడి ఆవాసం కోసం అంటూ అట్లూరు, బద్వేలు మండలాల పరిధిలోని మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించారు. ఈ చ‌ర్యల‌తో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక‌త ఎదుర‌వుతోంది. అడ‌వులు ద‌ట్టంగా ఉన్న రోజుల్లోనే క‌నిపించ‌ని క‌లివికోడి.. అడ‌వులు అంత‌రించిపోయాక ఎక్కడ వుంటుంద‌ని వాపోతున్నారు అట్లూరు ప్రజలు. కోడి పేరు చెప్పి తమ జీవితాల‌ను అస్తవ్యస్తం చేస్తున్నార‌ని  ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.
  

మరింత సమాచారం తెలుసుకోండి: