బ్రిటన్‌ రాజకుటుంబ వారసుడు ప్రిన్స్‌ హ్యారీ త‌మ కుటుంబం నుంచి విడిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. రాజ కుటుంబం నుంచి వేరుపడి.. బ్రిటన్‌తో పాటు అమెరికాలో స్వతంత్రంగా ఉంటామని ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌ మెర్కెల్‌ దంపతులు ఇటీవల చేసిన ప్రకటన సంచలనాన్ని సృష్టించడం తెలిసిందే. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనుకోవడంతో పాటు తాము  రాజకుటుంబంలో సీనియర్‌ సభ్యులుగా కొనసాగబోమని ప్రకటించారు. త‌న‌ మనుమడి నిర్ణ‌యంపై ఎలిజబెత్‌ రాణి స్పందించారు. ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. అయితే, దానికి హ్యారీ సైతం తాజాగా రియాక్ట‌య్యారు.

 

రాజకుటుంబం నుంచి వేరుపడాలన్న ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌ మార్కెల్‌ దంపతుల నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు క్వీన్‌ ఎలిజబెత్‌-2 ప్రకటించారు. కానీ రాజకుటుంబంలో ఈ జంట పాత్రకు సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆమె నొక్కి చెప్పారు. సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం శనివారం రాత్రి క్వీన్‌ ఎలిజబెత్‌-2 పేరు మీదుగా బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘హ్యారీ, మేఘన్‌, ఆర్చీ ఎప్పటికీ మా కుటుంబంలోని సభ్యులే. గత రెండేండ్లుగా వారిపై కొనసాగుతున్న నిఘాతో వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్టు నేను గుర్తించా. స్వతంత్రంగా ఉండాలనుకుంటున్న వారి నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నా. నేటి ఒప్పందంతో ఆ జంట ఆనందకరమైన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆకాంక్షిస్తున్నా’ అని ఎలిజబెత్‌-2 అన్నారు.

 


అయితే, ఎలిజ‌బెత్ ప్ర‌క‌ట‌న అనంత‌రం ప్రిన్స్‌ హ్యారీ స్పందించారు. రాజకుటుంబం నుంచి విడిపోవడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందని బ్రిటన్‌ రాజకుటుంబ వారసుడు తెలిపాడు. రాజకుటుంబం నుంచి విడిపోయిన తరువాత ఆదివారం రాత్రి మొదటిసారిగా ప్రిన్స్‌ హ్యారీ ఒక ప్రకటన విడుదల చేశారు. మెఘాన్‌ మార్కెల్‌తో వివాహం అనంతరం తామిద్దరం ఎంతో ఉత్సాహంతో భవిష్యత్‌ గురించి కలలు కన్నామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కుటుంబం నుంచి విడిపోతున్నందుకు ఎంతో విచారంగా ఉందని తెలిపారు. ఈ నిర్ణయం ఎంతో బాధతో తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే బ్రిటన్‌ ఎప్పుడూ తన ఇల్లుగానే ఉంటుందని ఆయ‌న తెలిపారు. 

 

‘నేను రాజకుటుంబంలో పుట్టాను, నా దేశానికి, మహారాణికి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మీకు సేవ చేయడం మా ధన్యత, ఈ సేవా జీవితాన్ని కొనసాగిస్తాము’ అని సెంటెబేల్‌ చారిటీ సంస్థ ఏర్పాటు చేసిన విందులో హ్యారీ చెప్పారు. ‘23 ఏళ్ల‌ క్రితం నా తల్లి ప్రిన్సెస్‌ డయానా కారు ప్రమాదంలో మరణించినప్పుడు మీరంతా నన్ను మీ రెక్కల కిందికి చేర్చుకున్నారు. ఇంతకాలం నన్ను ఆదరించారు’ అంటూ ప్రిన్స్‌ హ్యారీ భావోద్వేగానికి గురయ్యారు. రాజకుటుంబం నుంచి విడిపోయిన నేపథ్యంలో హ్యారీ మెఘాన్‌ జంట తమ పేర్ల ముందు హిస్‌ హైనెస్‌ అనే బిరుదును కోల్పోతారు. ప్రభుత్వం నుంచి రాజకుటుంబానికి లభించే నిధులలో వాటాను కోల్పోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: