తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్‌ మాఫియాను రెచ్చిపోతోంది. వారి కన్ను పడితే చాలు.. కొండలు కూడా మాయమవుతాయి. రాత్రికిరాత్రే తవ్వకాలు మొదలవుతాయి. మట్టిని కూడా వదలకుండా మైనింగ్ మాఫియా దోచుకుంటుంది. అక్రమ మట్టి తవ్వకాలతో కోట్ల రూపాయలను వెనకేసుకుంటోంది మాఫియా. 

 

తూర్పుగోదావరి జిల్లాలో కొండలను గుల్ల చేస్తున్నారు అక్రమార్కులు. ఎకరా భూమిలో మట్టి తవ్వకాలకు అనుమతి పొంది.. పరిసరాల్లోని ప్రభుత్వ భూముల్లోనూ గుట్టుచప్పుడు కాకుండా మైనింగ్‌ చేస్తున్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినా వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రధానంగా ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రాజానగరం, మండపేట, కడియం ప్రాంతాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి.

 

ఇటీవల కొత్త తుంగపాడులో మట్టి తరలింపు వ్యవహారం రైతులు, గ్రావెల్‌ తవ్వకందారుల మధ్య వివాదానికి దారితీసింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలు పెరిగినట్లు  గుర్తించారు విజిలెన్స్‌ అధికారులు. రాత్రిపూట మట్టిని తరలిస్తున్న లారీలను సీజ్‌ చేశారు. మూడు నెలల్లో 9 కోట్ల 28 లక్షల రూపాయలు విలువైన మట్టిని అక్రమంగా తరలించినట్లు  అధికారులు గుర్తించారు.  

 

అటు ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని ఆండ్రూ మినరల్స్ లీజు ప్రాంతంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 200 ఎకరాల అటవీ భూమిని 2013లో లీజుకు తీసుకుని అండ్రూస్ కంపెనీ తవ్వకాలు సాగిస్తోంది. లీజుదారులు హద్దు మీరుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. మైనింగ్ పై సమగ్ర విచారణ చేపట్టి  అక్రమాలు వెలికి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

తూర్పుగోదావరిలో జోరుగా సాగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు ప్రభుత్వం కళ్లెం వేయకపోతే భారీనష్టం తప్పదని అంటున్నారు జిల్లా వాసులు. ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలు సొమ్ము అక్రమార్కుల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కోరుతున్నారు. అక్రమ మట్టి తవ్వకాలతో కోట్ల రూపాయలను వెనకేసుకుంటోంది మాఫియా. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: