గద్వాల మున్సిపాలిటీ ఎన్నిక అత్తా, అల్లుళ్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. తొలిసారి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తహతహలాడుతుంటే...  మరో సారి తన పట్టు నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు బీజేపీ నేత డీకే అరుణ. అభ్యర్ధులెవరైనా అత్త, అల్లుళ్ల మధ్య పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. 

 

గత అసెంబ్లీ ఎన్నికల వరకు గద్వాల కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ఇక్కడ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి, కాంగ్రెస్ హవానే కొనసాగిస్తూ వస్తోంది. 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్ల్లో  బీజేపీ, టీడీపీ ఒక్కోసారి పురపీఠాన్ని అధిష్టించగా.. మిగతా అన్నిసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. గత ఎన్నికల వరకు డికే అరుణ నాయకత్వంలో గద్వాల మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండానే ఎగిరింది. కానీ ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. డీకె అరుణ పార్టీ వీడటంతో  కాంగ్రెస్‌కు కష్టాలు మొదలయ్యాయి. 

 

ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. ఆ తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. అదే జోరు కొనసాగించి గద్వాల పురపోరులో విజయం సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. 

 

ఇదిలా ఉంటే తన అనుచరవర్గాన్ని గెలిపించుకోవడం ద్వారా మున్సిపాలిటీపై కమలం జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది డీకే అరుణ. మొదటి నుంచి తమకున్న ఫాలోయింగ్, తెలంగాణ సర్కార్ వైఫల్యాలు తమకు కలిసొస్తాయనే ధీమా ఉంది. గద్వాల మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య  ప్రధాన పోటీ నెలకొంది. 

 

మొత్తం మీద గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలు అత్తా, అల్లుళ్లకు సవాలుగా మారాయి. తొలిసారి గులాబీ జెండా ఎగరేసి తన అధిపత్యాన్ని ప్రదర్శించాలని అధికార పార్టీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి భావిస్తుండగా... కమలం జెండా ఎగురవేసి గద్వాలలో తనకు తిరుగు లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు డీకే అరుణ. పురపోరులో పైచేయి సాధించేదెవరో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: