’వైసిపి ప్రభుత్వాన్ని కూల్చే వరకూ జనసేన నిద్రపోదు’  ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన హెచ్చరిక.  రాజధాని ప్రాంతంలోని రైతులతో పవన్ ఈరోజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ భీషణ ప్రతిజ్ఞ చేశారు.  ఎన్నికల సమయంలో కూడా జగన్ ను సిఎం కానివ్వనంటూ బహిరంగంగా సవాలు చేసిన విషయం అందరికీ గుర్తుంటే ఉంటుంది. తర్వాత ఏమైంది ?

 

ఏమైంది జగన్ అఖండ మెజారిటితో అధికారంలోకి  వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. వైసిపి గాలికి జనసేన తుడిచిపెట్టుకుపోయింది. అదే సమయంలో రెండుచోట్ల భీమవరం, గాజువక నియోజకవర్గాల్లో  పోటి చేసిన పవన్  ఓడిపోయిన విషయం తెలిసింది.

 

అంటే పవన్ తో సమస్య ఏమిటంటే తన సామర్ధ్యం ఏమిటో తనకు తెలీదు. అంటే తనకు అసలు ఎటువంటి సామర్ధ్యమూ లేదన్న విషయం తనకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎదుటి వాళ్ళని అంటే జగన్ ను  చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. జగన్ విషయంలో పవన్ వైఖరి మొదటి నుండి ఇదే విధంగా ఉంటోంది. అందుకనే పవన్ ను జగన్ అసలు పట్టించుకోవటమే మానేశారు.

 

చంద్రబాబుతో కలిసి జగన్ ను ఏమో చేద్దామని అనుకుంటే ఇద్దరినీ కలిపి జనాలు వాయించేసి మూల కోర్చోబెట్టారు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాని స్ధితిలో చివరకు బిజెపి పంచన చేరారు. పవన్ మాటలు చూస్తుంటే తాను బలపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు లేదు.  జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టటమే ఏకైక ధ్యేయంతో కమలం పార్టీతో చేతులు కలిపినట్లు అనుమానంగా ఉంది.

 

మరి పవన్ టార్గెట్ రీచవుతారా ? పోనీ వైసిపి ప్రభుత్వాన్ని పడగొట్టటమంటే పవన్ ఉద్దేశ్యంలో బహుశా జగన్ ను సిఎంగా దింపేయటమని అనుకోవాలేమో. సరే పవన్ చెప్పినట్లుగా జగన్ ను దింపేసినా వైసిపి ప్రభుత్వమైతే ఉంటుంది కదా.  బిజెపి కానీ జనసేన కానీ లేకపోతే చంద్రబాబును కలుపుకున్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు కదా ? మరి ఈ లెక్కలన్నీ పవన్ కు తెలీవేమో ? అందుకనే ఏమేమో మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: