జనసేన పార్టీ ఊహించ‌ని విధంగా వార్త‌ల్లో నిలుస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా ఆ పార్టీని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకోగా....ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు షాక్ ఇచ్చే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఏపీ రాజధాని విషయంలో జగన్ నిర్ణయానికే జై కొడతానని ఆయన ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ ఆయ‌న‌కు ముంద‌స్తుగా లేఖ రాసినా..త‌న నిర్ణ‌యం తాను తీసుకున్నాడు. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా అసెంబ్లీలో ప్ర‌క‌టించాడు. దీంతో షాక్ తిన‌డం జ‌న‌సేనాని వంతు అయింది. అయితే, తాజాగా ఇంకో షాక్ త‌గిలింది. `ఉన్నదొక్కటీ ఊడగొట్టుకున్న పవన్ అంటూ ఫేక్ మెసేజ్!` ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.



వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని ఏపీ ప్రభుత్వ అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఇస్తాన‌ని ప్ర‌క‌టించి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో క‌ల‌క‌లం రేకెత్తించింది.  మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగి అనంతరం వోటింగ్ జరిగితే తాను అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆయ‌న‌పై సస్పెన్ష‌న్ వేటు ప‌డుతుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యంలో సోష‌ల్ మీడియాలో కొత్త ప్ర‌చారం జ‌రిగింది. ఎమ్మెల్యే రాపాక‌పై ప‌వ‌న్ స‌స్పెన్ష‌న్ వేటు వేశార‌నేది ఆ ప్ర‌క‌ట‌న సారాంశం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుతో ప్ర‌క‌ట‌న వెలువ‌డింద‌ని ఓ ప్రెస్‌నోట్ సోషల్‌ మీడియాలో తెగ వైర‌ల్ అయింది.



అయితే, ఈ మెసేజ్ విష‌యంలో ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యేపై ప‌వ‌న్ స‌స్పెన్ష‌న్ వేటు వేశాడ‌నేది ఉత్త అబ‌ద్ద‌మ‌ని, స‌ద‌రు ప‌త్రికా ప్ర‌క‌ట‌న తాము విడుద‌ల చేసింది కాద‌ని జ‌న‌సేన పార్టీ వివ‌ర‌ణ ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో ఈ మేర‌కు ప్ర‌చారం చేస్తున్న వాటిని పార్టీ శ్రేణులు గ‌మ‌నించాల‌ని కోరింది. కాగా, ఈ స‌స్పెన్ష‌నే నిజ‌మైతే..ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్న ఒక్క ఎమ్మెల్యేను సైతం పోగొట్టుకున్న‌ట్లేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: