సాయి జన్మస్థలంపై చెలరేగిన వివాదం షిర్డీలో తెరపడిందనుకున్న సమయంలో.. పత్రిలో ఆందోళనలు మొదలయ్యాయి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే హామీతో షిరిడీ వాసులు ఆందోళన విరమించారు. దీంతో షిరిడీలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.  

 

షిరిడి వివాదం ముగింపునకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. సాయి సచ్చరిత్రలో జన్మ స్థల ప్రస్తావన లేదని...ఇకపై సాయి జన్మస్థల ప్రస్తావన ఉండదని షిరిడి ప్రజలకు ఉద్ధవ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీతో ఆందోళన విరమించారు. సాయి జన్మస్థలంపై తప్పుడు వార్తలను ఎవరూ నమ్మొద్దని సీఎం ఉద్ధవ్ తెలిపారు. ఇకపై ఎలాంటి ఆందోళనలు వద్దని... ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు మహారాష్ట్ర సీఎం.

 

షిర్డీ సాయిబాబా జన్మస్థలం ఏదనే విషయంలో తలెత్తిన వివాదంపై అటు శివసేన కూడా వెనక్కి తగ్గింది. ఇకముందు బాబా జన్మస్థలంగా పత్రిని పేర్కొనేది లేదని సేన తెలిపింది. దీనిపై కొత్త వివాదం సృష్టించే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని వివరించింది. ఈ వివాదం ఇంతటితో ముగిసినట్టేనని సేన స్పష్టం చేసింది. షిర్డీ ట్రస్టు ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సమావేశమయ్యారు.  షిర్డీ సాయిబాబా జన్మస్థలంగా పత్రిని ఇకముందు పేర్కొనరాదని సమావేశం నిర్ణయించింది. దీనిపై కొత్త వివాదాలకు తావులేదని...ఈ వివాదం ఇక ముగిసినట్టేనని స్పష్టం చేసింది శివసేన.

 

సాయిబాబా జన్మస్థలమైన పత్రి గ్రామాన్ని వంద కోట్లతో అభివృద్ధి చేస్తామని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఇటీవల ప్రకటించారు. ఇదే ప్రస్తుత  వివాదానికి కారణమైంది. బాబా జన్మస్థలంగా పత్రిని ప్రకటించి, అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాశస్త్యం తగ్గిపోతుందని షిర్డీ గ్రామ ప్రజలతో పాటు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. షిర్డీ నిరవధిక బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. శివసేనకు చెందిన స్థానిక నేతలు కూడా కూడా షిర్డీవాసుల బంద్‌కు మద్దతుగా నిలిచారు. ముందు తాము షిర్డీ భక్తులమని, ఆ తర్వాతే చట్టసభలకు ఎన్నికయ్యామని వారిని శాంతింప చేసే ప్రయత్నాలు చేశారు. 

 

పత్రిని బాబా జన్మస్థలంగా ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనంత వరకూ తాము వెనక్కి తగ్గేదిలేదని షిర్డీవాసులు స్పష్టం చేశారు. దీంతో ఆలయ ట్రస్టు ప్రతినిధులతో ఉద్ధవ్ థాక్రే భేటీ అయ్యారు. ఈ సమావేశం షిరిడీలో నెలకొన్న పరిస్థితులను సద్దుమణిగేలా చేసింది. ముఖ్యమంత్రితో శివసేన జరిపిన చర్చలు సఫలం కావటంతో షిరిడీ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: