ఈరోజు రాత్రి అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి.  రాత్రి పది గంటలకు క్యాబినెట్ సమావేశం జరపాలని జగన్ డిసైడ్ చేశారు. సమావేశానికి హాజరయ్యేందుకు ప్రతి మంత్రి అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు.  ఇంత అర్జంటుగా మంత్రివర్గ సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ?

 

ఎందుకంటే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం  శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకునేందుకే జగన్ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. మండలి రద్దువుతుందన్న సమాచారం లీకవ్వటంతో ఉదయం నుండి శాసనమండలిలో టిడిపి నేత యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ తదితరులు పెద్ద గోల చేస్తున్నారు.

 

మండలి రద్దుకు సంబంధించే శాసనమండలిలో పెద్ద గోల జరుగుతోంది. నిజానికి అసెంబ్లీలో వైసిపికి పూర్తిస్ధాయి మెజారిటి ఉన్నప్పటికీ  శాసనమండలిలో మాత్రం మైనారిటియే అన్న విషయం అందరికీ తెలిసిందే. మండలిలో మెజారిటి ఉన్నదన్న ధీమాతోనే  అసెంబ్లీలో పాస్ అయ్యే చాలా కీలక బిల్లులను టిడిపి మండలిలో అడ్డుకుంటోంది. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ను ప్రవేశపెట్టటం, ఎస్సీ కమీషన్ బిల్లును కూడా టిడిప అడ్డుకుంది.

 

నిజానికి ఈ బిల్లులను అడ్డుకున్నందు వల్ల టిడిపికి వచ్చే లాభం కూడా ఏమీ లేదు. ఎందుకంటే  అసెంబ్లీలో చంద్రబాబు అండ్ కో ఆమోదించిన తర్వాత మండలిలో టిడిపి అడ్డుకోవటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఇటువంటి పనికిమాలిన చేష్టలు చేయటం వల్లే మండలిలో టిడిపి వ్యవహరిస్తున్న తీరుపై జగన్ కు ఒళ్ళు మండిపోతోంది. బిల్లులను పాస్ చేసుకునేందుకు మంత్రులు ఎంతగా ప్రయత్నిస్తున్నా టిడిపి సభ్యులు మాత్రం పడనీయటం లేదు.

 

వచ్చే ఏడాది జూన్ వరకూ మండలిలో టిడిపిదే ఆధిక్యత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకున్న ఏ బిల్లు కూడా పాస్ కాదు. ఇపుడు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును అడ్డుకోవటంతో క్లైమ్యాక్స్ కు వచ్చేసింది.  అదే సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన బిల్లులు కాకుండా మెజారిటి ఉందన్న ఏకైక కారణంతో, ఛైర్మన్ కూడా టిడిపి నేతే అన్న ధీమాతో తమిష్టం వచ్చిన చర్చను మొదలుపెట్టింది. దాంతో జగన్ చాలా సీరియస్ అయ్యారు. అందుకనే అత్యవసర క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. చూద్దాం ఏం నిర్ణయం తీసుకుంటారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: