ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పొలిటికల్ గేమ్ మొదలుపెట్టింది. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ పార్టీ ఆ తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారు. 
 
మూడు రాజధానుల నిర్ణయంతోనే జగన్ 13 జిల్లాల ప్రజల మెప్పు పొందారు. మూడు రాజధానుల బిల్లు ఇప్పటికే కేబినేట్ లో మరియు అసెంబ్లీలో ఆమోదం పొందింది. శాసన మండలిలో బిల్లు ఎలా పాస్ అవుతుందనే ప్రశ్నకు సమాధానంగా వైసీపీ తన మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఇప్పటికే వైసీపీ ప్లాన్ లో భాగంగా కొంతమంది టీడీపీ పార్టీ ఎమ్మెల్సీలు తమ  పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. జగన్ తన మైండ్ గేమ్ తో వేట మొదలుపెట్టడంతో టీడీపీలో కలవరం మొదలైంది. 
 
టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇప్పటికే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా విషయం తెలిసిందే. వైసీపీ పార్టీ మంత్రులు తెలుగుదేశం పార్టీకి చెందిన మండలి సభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ మండలి సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ చెబుతూ ఉండటంతో షాక్ అవడం టీడీపీ వంతయింది. మంత్రులు వైసీపీ కీలక నేతలు మండలి రద్దవుతుందని ప్రచారం చేయటం గమనార్హం. 
 
ఈరోజు రాత్రికి కేబినేట్ భేటీ ఉంటుందంటూ వైసీపీ లీకులు ఇవ్వటంతో తెలుగుదేశం పార్టీ నేతలకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. శాసనసభ కార్యదర్శి ఇప్పటికే మండలి రద్దుకు సంబంధించిన లీకులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.  మండలిలో బిల్లు పాస్ అవని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు వైసీపీ మైండ్ గేం మొదలు పెట్టిందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు టీడీపీలో ఉంటే ఇక భవిష్యత్తు లేదని వైసీపీకే మద్దతు ఇవ్వాలని చంద్రబాబుకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: