కోట్ల రూపాయల కరెన్సీ చేతులు మారుతోంది. ఓటు ఐదువేలు దాకా రేటు పలుకుతోంది. చికెన్, మటన్ లకు విలువే లేదు...
కందిపప్పు, పెసరపప్పు, టీ పొడి, పాలు ...కరెన్సీ నోట్ల నుంచి బంగారం వరకు... ప్రలోభాల్లో కూడా క్రియేటివిటీ చూపుతున్నారు.  మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న సమయంలో అభ్యర్ధులు ఓటర్లను బుట్టలో వేసుకోటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపించటంతో ప్రలోభాలు ఊపందుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపారు. హంగూ, ఆర్భాటాల్లేకుండా ఇంటింటికీ వెళ్లి నగదు, మద్యంతో పాటు గిఫ్టులు ఇస్తూ వారిని ఆకర్షించే పనిలో పడ్డారు. నగదు పంపిణీ చేస్తూ పెద్దపల్లి, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో అభ్యర్థులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుబడ్డారు. ఈ రెండు మున్సిపాలిటీలే కాకుండా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ప్రలోభాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 

 

పలుచోట్ల మద్యం, మాంసం పంపిణీ ఇప్పటికే ప్రారంభం కాగా, నగదు, చీరలు, కుర్చీలు, వాచీలు, బంగారు కాయిన్స్,  ఆభరణాలు కూడా పంపిణీ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. అభ్యర్థులు భారీగా కొనుగోళ్లు చేయడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని దుకాణాల్లో మద్యం స్టాక్ దొరకటం కష్టమైపోయింది. దీంతో మద్యం కావాలంటూ డిపోలకు శని, ఆదివారాల్లో భారీగా ఆర్డర్లు వచ్చాయి. 

 

పెద్దపల్లిలో ఓ అభ్యర్థి.. యథేచ్చగా డబ్బులు పంచుతూ, తనకే ఓటేయాలని చెప్తూ కెమేరాకి దొరికాడు. సత్తుపల్లిలో మరో అభ్యర్థి జనాల్ని వరుసలో నిలబెట్టి డబ్బులు పంచాడు. ముచ్చటగా క్యూ పద్ధతిలో.. ఒక్కొక్కరుగా వచ్చి డబ్బులు తీసుకుని వెళ్లే దృశ్యం మీడియాకెక్కింది. 
ఖమ్మంలోనే మరో అభ్యర్థి తరపున ఓటర్లకు  గిఫ్టులు పంపిణీ చేస్తూ అడ్డంగా కెమెరాకు దొరికిపోయారు. వాహనాల్లో గిఫ్టు ప్యాక్లను తీసుకొచ్చి పంచేస్తున్నారు.

 

చాలా చోట్ల ఒక్కో ఓటుకు ఏకంగా.. రెండు వేల నుంచి ఐదువేలు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ లో ఆరుగురు సభ్యులున్న కుటుంబానికి ఒక్కరోజులో 78,000 రూపాయలు అభ్యర్ధులనుండి వచ్చాయని సమాచారం. పోలింగ్ నాటికి ఈ ప్రలోభాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

 

120 మున్సిపాలిటీల పరిధిలోని 2,648 వార్డులు, 9 కార్పొరేషన్ల పరిధిలో 324 డివిజన్ల పరిధిలో, జీహెచ్ఎంసీలోని డబీర్పురా డివిజన్ ఉప ఎన్నికతో బుధవారం ఉదయం 7 నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇటీవల ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగిన భైంసా మున్సిపాలిటీలో యథాతథంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొత్తం 7,961 కేంద్రాల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. 

 

మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మీరంటేమీరు, డబ్బులు పంచుతున్నారంటూ పాలక, ప్రతిపక్ష నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. డబ్బులు పడేసే వాళ్ళను ఎన్నుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఎలక్షన్ కమీషనర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన లెక్కలు తప్పుగా చూపినప్పుడు అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే అభ్యర్థి ఎన్నిక రద్దు చేస్తామన్నారు. పెద్దపల్లిలో డబ్బులు పంచుతుండగా వీడియో తీయడంతో అరెస్ట్ చేశామని, గద్వాల, అలంపూర్ లో డబ్బులు పంచుతున్న కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో 44లక్షల 41 వేల రూపాయలు సీజ్ చేశామని తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: