ఢిల్లీలో కేజ్రీవాల్, మనోజ్ తివారీల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. పరస్పర విమర్శలు సంధిస్తున్నారు. ఆ పార్టీకి ఓటేస్తారో.. లేదా మా పార్టీకి ఓటేస్తారో మీరే తేల్చుకోండి అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కేజ్రీవాల్ నామినేషన్ ప్రక్రియ పెద్ద ప్రహసనంలా మారింది.

 

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచార వేగం పెంచాయి. గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తమ వాగ్ధాటితో ప్రత్యర్థి పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భాజపా ఎంపీ మనోజ్ తివారీ ట్విటర్ వేదికగా మాటల యుద్ధానికి దిగారు. ఎవరివైపునుంటారంటూ, పరస్పరం విమర్శించుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ మంగళవారం ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు. ఓ వైపు - బీజెపీ, జేడీయూ, ఎల్జేపీ, జేజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ.. మరోవైపు - స్కూల్, హాస్పిటల్, నీరు, విద్యుత్, మహిళలకు ఉచిత రవాణా, ఢిల్లీ ప్రజలు.  నా లక్ష్యం - అవినీతిని ఓడించడం, దిల్లీని ముందుకు తీసుకెళ్లడం.. వారందరి ఏకైక లక్ష్యం - నన్ను ఓడించడం అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

 

కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కేవలం 30 నిమిషాల్లోపే బీజెపి దిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ సీఎంకు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ఓ వైపు - దెబ్బతిన్న రోడ్లు, కలుషితమైన, విషపూరితమైన నీరు, ఒక్క కొత్త స్కూల్, కొత్త ఆసుపత్రి లేదు. హాస్పిటళ్లలో ఆపరేషన్ థియేటర్లు మూతబడ్డాయి... ఒక్క విద్యుత్ బస్సు కూడా లేదు. అవినీతిపై పోరాడుతున్న నేతలను పార్టీ నుంచి తొలగించింది. మహాకూటమితో కాంగ్రెస్తో చేతులు కలిపింది. మొత్తానికి 70 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైంది. మరోవైపు -బీజెపీ అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం పనిచేస్తోంది.... అని తివారీ ఆప్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఢిల్లీ ప్రజలు బీజెపీతోనే ఉంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు. 

 

మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేసేందుకు చివరిరోజు నానా ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఆయన నిర్వహించిన రోడ్షో కారణంగా ఆలస్యం కావడంతో నామినేషన్ వేయలేకపోయారు. దీంతో మంగళవారం నామినేషన్ వేసేందుకు ఆయన తన తల్లిదండ్రులను వెంట తీసుకొని వెళ్లారు. కానీ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయటానికి చాలా సమయం పట్టింది. 

 

జామ్నగర్ హౌస్లో నామినేషన్ వేసేందుకు  కేజ్రీవాల్ వెళ్లారు. కానీ అక్కడ ఆయన క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. సీఎం కేజ్రీవాల్ ముందు దాదాపు 50 మంది స్వత్రంత అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు క్యూలో ఉన్నారు. దీంతో ఆయన వారి వెనుకే నిలబడాల్సి వచ్చింది. కేజ్రీవాల్ ను ముందు వెళ్లనీయం అని లైనులో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు అనడంతో వేచి ఉండకతప్పలేదు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఫిబ్రవరి 8న ఎన్నిక జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: