రక్షణ దళాల అధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉగ్రవాదంపై పోరులో  అమెరికా మార్గమే మేలు అని, ఆ దేశాన్ని అనుసరించాలని ఆయ‌న కీల‌క కామెంట్లు చేశారు.  9/11 ఉగ్రదాడుల తర్వాత ఉగ్రవాదుల అణిచివేతకు అమెరికా అనుస రించిన కఠిన మార్గాన్నే ఇప్పుడు అన్నిదేశాలు కూడా అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికి కొన‌సాగింపుగా, పాకిస్థాన్‌తో యుద్ధం ఎప్పుడొస్తుందో అంచనా వేయలేమని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

 

టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశాలతో ఎప్పటికైనా ప్రమాదమేనని రక్షణదళాల అధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్ అన్నారు. కనుక ఉగ్రవాదం అనే మహమ్మరిని కూకటివేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. యుద్ధం విష‌యంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రక్షణ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తమిళనాడులోని తంజావూరు ఎయిర్‌స్టేషన్‌లో ‘టైగర్‌షార్క్స్‌' 222 స్కాడ్రన్‌ను వాయుసేన ఏర్పాటు చేసింది. బ్రహ్మోస్‌ క్షిపణులను మోసుకెళ్లగలిగే సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాలను దక్షిణ భారత్‌లో తొలిసారి మోహరించనున్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కీల‌కంగా మారాయి. 

 

ఇటీవ‌లే పాక్‌ను ఉద్దేశించి రావ‌త్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశాలు భాగస్వాములు కావడానికి వీలులేదు. అలాంటి దేశాలను దౌత్యపరంగా, ఇతర అంశాల పరంగా ఏకాకిని చే యాలి’ అని రావత్‌ సూచించారు. ప్రధానం పాక్‌ను ఉద్దేశించే రావత్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించే వారిని అణిచివేయడంతోపాటు అతివాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని రావత్‌ చెప్పారు. అతివాద భావజాలానికి ఆకర్షితులై తీవ్రవాదం వైపునకు మొగ్గు చూపుతున్న యువతను గుర్తించి వారిలో మార్పు తేవడానికి తాము కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా డీ-రాడికలైజేషన్‌ శిబిరా లను నడుపుతున్నామన్నారు. ‘కశ్మీర్‌లో 10, 12 ఏళ్ల‌ వయసున్న పిల్లలూ అతివాద భావజాలానికి ఆకర్షితులవుతున్నారు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వుతున్నారు. ప్రధానంగా 2016లో హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనీ హతమైనప్పటి నుంచి ఎక్కువగా యువత అతివాద భావజాలానికి ఆకర్షితులవుతున్నారు’ అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: