జాతీయ జనాభా పట్టిక‌ (నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌-ఎన్పీఆర్‌) విష‌యంలో కేంద్రం-రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) నవీకరణలో సహకరించలేమని కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పాలని కేరళలోని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న భయాలను తగ్గించడంతోపాటు శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కేంద్రానికి ఎల్డీఎఫ్‌ సర్కార్‌ స్పష్టం చేయనుంది. 

 

సీఎం పినరాయి విజయన్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన ఎల్డీఎఫ్‌ ప్రత్యేక క్యాబినెట్‌ సమావేశం ఎన్పీఆర్‌ నవీకరణపై చర్చించింది. ఎన్పీఆర్‌ నవీకరణకు సహకరించలేమని కేంద్ర హోంశాఖ పరిధిలోని జనాభా గణన కమిషనర్‌, రిజిస్ట్రార్‌ జనరల్‌కు తెలియజేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే, జనాభా లెక్కల సేకరణలో మాత్రం పూర్తిగా సహకరిస్తామని క్యాబినెట్‌ పేర్కొన్నట్లు కేరళ సీఎం కార్యాలయం తెలిపింది. మరోవైపు, సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విజయన్‌ సర్కార్‌ ఇచ్చిన వివరణను కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహ్మద్‌ఖాన్‌ తిరస్కరించారు. తనకు సమాచారం ఇవ్వకుండా పిటిషన్‌ దాఖలు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. పిటిషన్‌ దాఖలు చేయడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏ నిబంధనను ఉల్లంఘించలేదని గవర్నర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారని అధికార వర్గాలు తెలిపాయి.

 

ఇటీవ‌ల‌ క్యాబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, పీయూష్‌ గోయల్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. అసోం మినహా మిగిలిన అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ జనాభా పట్టికను (నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌-ఎన్పీఆర్‌)ను సవరించాలని (అప్‌డేట్‌ చేయాలని) నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఎన్పీఆర్‌ సవరణకు రూ.3,941.35 కోట్లు, 2021 జనగణనకు రూ.8,754.23 కోట్లు కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2021 జనాభా లెక్కల సేకరణ తొలి విడుత ప్రక్రియతోపాటే వచ్చే ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య ఎన్పీఆర్‌ ప్రక్రియనూ చేపట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: