జనసేన అధినేత, మిత్రపక్ష నేత పవన్ కల్యాణ్ కు బిజెపి పెద్ద షాకే ఇచ్చింది.  అమరావతి రాజధాని తరలింపుపై జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు చేసిన తాజా ప్రకటనతో  పవన్ కు దిమ్మ తిరిగిపోయుండాలి.  అమరావతి తరలింపుపై మాట్లాడుతూ రాజధాని అంశంతొ  కేంద్రప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మరోసారి తేల్చి చెప్పేశారు.

 

తాను బిజెపితో పొత్తు పెట్టుకోగానే  జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం ద్వారా హిడెన్ అజెండాను అమలు చేయించవచ్చని పవన్ అనుకున్నట్లున్నారు.  అందుకనే పొత్తును ప్రకటించే విషయంలో కూడా అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎలాగూ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా వ్యతిరేకమే కాబట్టి ఇక అడ్డే ఉండదని అనుకున్నారు. తీరా చూస్తే తాజాగా జీవిఎల్ చేసిన ప్రకటనతో పవన్ కు షాక్ కొట్టిందనే చెప్పాలి.

 

జీవిఎల్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని ఏర్పాటు, తరలింపు అంశాలపై కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని జీవిఎల్ ఎప్పటి నుండో చెబుతున్నా కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి లాంటి నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. వారితో తాజాగా పవన్ కూడా జత కలిశారు. అయితే మూడు రాజధానులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కన్నా పాత పాటనే ఢిల్లీలో  వినిపించారు.

 

అందుకనే జీవిఎల్ మళ్ళీ కన్నా ప్రకటనకు కౌంటర్ ఇచ్చారు.  అమరావతి తరలింపును ఆపేందుకు కేంద్రప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలన్న చంద్రబాబు డిమాండ్ ను   తిప్పికొట్టారు.  రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటి రిపోర్టుకు విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు ఇపుడు జగన్ ప్రయత్నాలను ఆపు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయటంపై  మండిపడ్డారు.

 

శివరామకృష్ణన్ కమిటి రిపోర్టుకు విరుద్దంగా అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించినపుడు కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు జోక్యం చేసుకోని కేంద్రం ఇపుడు మాత్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందంటూ ఎదురు ప్రశ్నించారు.  మొత్తానికి జీవిఎల్ తాజాగా చేసిన ప్రకటనతో  జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న పవన్ , కన్నా, సుజనా లాంటి వాళ్ళందరికీ ఒకేసారి బిజెపి షాక్ ఇచ్చిందనే అనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: