పురపోరులో సత్తా చాటుకునేందుకు అధికార టీఆరెస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి . ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని తొమ్మిది   మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ద్వారా , ప్రధాన ప్రతిపక్ష పార్టీని కోలుకోకుండా దెబ్బతీయాలని టీఆరెస్ పార్టీ భావిస్తోంది . ఈ మేరకు పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం పూర్తిగా మున్సిపోల్స్ పై దృష్టిని సారించింది . మంత్రి జగదీష్ రెడ్డి అన్ని తానై సూర్యాపేట , హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో ప్రచార బాధ్యతలను స్వీకరించడమే కాకుండా , అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్నారు .

 

ఇక భువనగిరి మున్సిపాలిటీ ప్రచార బాధ్యతలను ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ కు పార్టీ నాయకత్వం అప్పగించింది . భువనగిరి మున్సిపాలిటీ అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కర్నె ప్రభాకర్ తీవ్రంగానే  శ్రమించారు . మిర్యాలగూడెం మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు భుజానికి ఎత్తుకోగా , దేవరకొండ పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేకు   పార్టీ నాయకత్వం అప్పగించింది . ఇక చండూరు , చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో అధికార టీఆరెస్ పార్టీ అభ్యర్థుల   గెలుపు బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  అన్ని తానై చూసుకుంటున్నారు .

 

పురపోరు లో ఎలాగైన సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ఉవ్విళ్ళు  ఊరుతున్నారు . ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ , పురపోరులో సత్తా చాటడం ద్వారా,  తామేంటో నిరూపించుకోవాలని ఆరాటపడుతోంది  . అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పలు స్థానాల్లో ఓటమి పాలయిన కాంగ్రెస్, ఈ ఎన్నికలను  అందివచ్చిన అవకాశంగా  భావిస్తోంది. పురపోరు లో మెజార్టీ స్థానాలను గెలవడం ద్వారా క్యాడర్ లో నూతనోత్తేజాన్ని నింపవచ్చునని కాంగ్రెస్ నాయకత్వం ఆశిస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: