జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. గ‌త కొద్దికాలంగా మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని నిజం చేస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా నేత‌ల‌ను ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి, ఒకింత గంద‌ర‌గోళానికి గురిచేసిన జ‌న‌సేనాని ఈ ద‌ఫా అదే ర‌క‌మైన రీతిలో పార్టీ నేత‌ల ముందే మాట్లాడారు. ప‌వ‌న్ చెప్పింది నిజ‌మ‌నుకోవాలా?  ఒక‌వేళ నిజ‌మ‌నుకుంటే..అలాంటి ప‌రిస్థితులు లేవు క‌దా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

 

వివ‌రాల్లోకి వెళితే, కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల చేతిలో దాడికి గురైన జనసేన నాయకులు, కార్యకర్తలతో జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, దాడులు జరిగినప్పుడు భయపడకూడదని అన్నారు. ``ఒక భావజాలంతో ఇంకో భావజాలాన్ని కొట్టాలి. భావజాలంతో సమస్యను అధిగమించినప్పుడే హింస తగ్గుతుంది. అనేక క్రిమినల్ కేసులు ఉన్న వారే అంత మొండిగా వ్యవహరిస్తుంటే మనం ఇంకెంత మొండిగా ఉండాలి.`` అని హిత‌బోధ చేశారు. 

 

``కొత్త నాయకులను, ఓ సరికొత్త రాజకీయ  వ్యవస్థను తయారు చేయాలన్నదే నా జీవితాశయం. సమాజానికి బలంగా నిలబడగలిగే నాయకత్వాన్ని తీసుకువచ్చినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. అప్పుడే రెండు, మూడు తరాలు బాగుపడతాయి. మనం ఒక రోల్ మోడల్ కావాలి. ఒక మాట మాట్లాడితే అది లక్ష మంది మెదళ్లలో ఆలోచన రేపాలి. పది లక్షల మంది వెన్నెముకల్లో కదలిక తేవాలి. బలంగా నిలబడిన వారే నాయకులు అవుతారు. భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఇద్దరు ఎం.పి.లతో ప్రారంభమయ్యింది. ఎమర్జెన్సీ సమయంలో అసలు పార్టీనే లేకుండా చేద్దాం అనుకున్నారు. పోరాటంతో ఈనాడు ఇంత బలంగా నిలబడింది. రాజకీయాలకు సరికొత్త రూపం ఇవ్వాలి. అంతా మాట్లాడుకునేదే అయినా ఓ సరికొత్త భావజాలాన్ని రాజకీయాలకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో పార్టీ స్థాపించాను. మన ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో కలిపి సుమారు 70కి పైగా ఎంపి స్థానాల్లో ఉంటుంది. `` అని చెప్పుకొచ్చారు. అయితే, 70కి పైగా ఎంపీ స్థానాల్లో ప‌వ‌న్ స‌త్తా ఉంటే...ఏపీలో కేవ‌లం ఒక్క అసెంబ్లీ స్థానంలో మాత్ర‌మే ఎలా గెలిచేవారు? ఆఖ‌రికి పార్టీ అధ్య‌క్షుడైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం రెండు చోట్ల ఓడిపోయేవారు? అంటూ ప‌లువురు స‌హ‌జంగానే చ‌ర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: