ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ఎంత సింపుల్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఢిల్లీ ఎన్నిక‌ల్లో భాగంగా ప్ర‌స్తుతం నామినేష‌న్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. పరిశీలన జనవరి 22న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 24. ఫిబ్రవరి 8న పోలింగ్‌ జరగనుంది. 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు స‌మీపిస్తుండ‌టంతో కేజ్రివాల్ ఈరోజు నామినేష‌న్ వేశారు. అయితే, తన నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఏకంగా ఆరు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. 

 


న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌.. నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసేందుకు ఇవాళ ఉదయం ఆయన రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి వెళ్లారు. అయితే నామినేషన్లు దాఖలు చేసేందుకు భారీగానే తరలివచ్చారు. కేజ్రీవాల్‌కు 45వ నంబర్‌ కేటాయించారు. సీఎం కంటే ముందున్న 35 మంది అభ్యర్థులు.. సరైన నామినేషన్‌ పత్రాలు లేకుండా, కనీసం 10 మంది మద్దతుదారుల వివరాలు లేకుండా దాఖలు చేసేందుకు వచ్చారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్దకు చేరుకున్న తర్వాత ఫోన్లలో వివరాలు తెలుసుకుని నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో కేజ్రీవాల్‌ నామినేషన్‌కు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో కేజ్రీవాల్‌ తన నామినేషన్‌ను దాఖలు చేసేందుకు 6 గంటలు వేచి ఉన్నారు.

 

ఈ విషయాన్ని గ్రేటర్‌ కైలాష్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇక ఇదే విషయాన్ని కేజ్రీవాల్‌ కూడా తన ట్విట్టర్‌ ద్వారా చెప్పారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు వేచి చూస్తున్నా.. తన టోకెన్‌ నంబర్‌ 45. నామినేషన్‌ దాఖలు చేసేందుకు భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. ఇంత మంది నామినేషన్‌ దాఖలు చేసేందుకు రావడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

 

కాగా, భారతీయ జనతా పార్టీ కావాలనే కేజ్రీవాల్‌ కంటే ముందు 45 మంది స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్‌ దాఖలుకు లైన్లో నిల్చోబెట్టిందని ఆప్‌ ఆరోపించింది. బీజేపీ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తుందని ఆప్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన ఢిల్లీకి మళ్లీ కేజ్రీవాల్‌ సీఎం అవుతారని తేల్చిచెప్పారు. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరైతే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి చేరుకుంటారో వారి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. ఈ వెసులుబాటుతో కేజ్రీవాల్‌ నామినేషన్‌ దాఖలుకు ఎలాంటి అంతరాయం కలగలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: