తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు పుర‌పాల‌క ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130 మున్సిపాలిటీల్లో 3,112 వార్డులు ఉన్నాయి. అయితే ఇందులో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ ప‌రిస్థితి చిత్రంగా మారింది. ఇప్ప‌టికే ఇందులో 82 వార్డులు ఏకగ్రీవమవగా ,79 టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. మిగిలిన మూడు మజ్లిస్‌ చేజిక్కించుకుంది. దీంతో నేడు జ‌రిగే పోలింగ్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. 

 

ఏకగ్రీవాలు పోగా, మిగిలిన 3,030 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అన్నివార్డుల్లోనూ బరిలో నిలిచారు. కానీ 356 స్థానాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరువయ్యారు. బీజేపీది మరీ ఘోరమైన పరిస్థితి. ఆ పార్టీకి ఏకంగా 659 వార్డుల్లో అభ్యర్థులే దొరుకలేదు. ఈ రెండు పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచినచోట వాస్తవంగా రెండో స్థానానికైనా పోటీపడాలి. కానీ ఈ పోటీ చివరకు డిపాజిట్లకు గండి కొడుతుందనే భయం వెంటాడింద‌ని అంటున్నారు.  స్వతంత్ర అభ్యర్థుల కంటే వెనుకబడితే జాతీయ పార్టీల పరువు పోతుందనే ఉద్దేశంతో, కనీసం రెండో స్థానంలో పరువు నిలుపుకొనేలా ఓట్లు దక్కించుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. 

 

కాగా, హైదరాబాద్‌ శివార్లలో వి‘చిత్రాలు’ క‌నిపిస్తున్నాయంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల్లో కాంగ్రెస్‌కు 356 వార్డుల్లో, బీజేపీకి 659 వార్డుల్లో అభ్యర్థులే లేరు. ఆయా మున్సిపాలిటీల్లోని వార్డుల్లో స్వతంత్రుల కంటే వెనుకబడుతామనే పరువు సమస్య రెండు పార్టీలను వెంటాడుతుంద‌ని కొంద‌రి మాట‌. ఉదాహరణకు..రంగారెడ్డి జిల్లాలోని బడంగ్‌పేట మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా, పది వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే లేరు. ఇక్కడ ఏకంగా 29 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఈ స్థానాల్లో నిలిచిన బీజేపీ అభ్యర్థులు, స్వతంత్రుల్లో మెరుగ్గా ఉన్నవాళ్లను ప్రసన్నం చేసుకొంటున్నారు. వారి ఓట్లను మళ్లించుకొని రెండో స్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారట‌. పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండగా, ప్రధానంగా హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో ఈ తరహా ప్రలోభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మొత్తంగా జాతీయపార్టీలుగా చెప్పుకొనే కాంగ్రెస్‌, బీజేపీలకు ఒక్కటీ ఏకగ్రీవం కాక‌పోవ‌డం...ఇలా న‌గ‌ర ప‌రిధిలోనే అభ్య‌ర్థులు లేక‌పోవ‌డం చర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: