ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని అమరావతిలో అంతా ఊహించిందే జరుగుతోంది. శాసన మండలి రద్దు దిశగా జగన్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సభ్యులు ఉండటం, ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు అడ్డుకట్ట పడటాన్ని నివారించడంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక, వివాదాస్పదమైన నిర్ణయానికి తీసుకోవడానికి వెనుకాడట్లేదని తెలుస్తోంది. వైఎస్ జగన్.. అత్యవసర మంత్రివర్గ సమావేశానికి పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు. ఈ రాత్రికే వెలగపూడిలోని సచివాలయం లేదా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది.

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున ప్రస్తుతం మంత్రులందరూ అందుబాటులోనే ఉన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఉన్నారు. మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన సమాచారం ఇప్పటికే వారందరికీ వెళ్లిపోయాయని తెలుస్తోంది. ప్రస్తుతం శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ హవా నడుస్తోంది. ఆ పార్టీకి భారీ సంఖ్యలో సభ్యులు ఉన్నారు. ఇక్కడ టీడీపీదే ఆధిపత్యం. మొత్తం 58 స్థానాలు ఉన్న శాసన మండలిలో 26 మంది సభ్యులు టీడీపీకి చెందిన వారే. మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒకరకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పాత్రే. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి తొమ్మిదిమంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

శాసనసభలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. మండలి విషయానికొచ్చేసరికి మెత్తబడాల్సి వస్తోంది.. మెట్టు దిగక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాగా గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు తన హయాంలో శాసన మండలిని రద్దు చేసిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

వైఎస్ జగన్ కూడా ఆయన బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. శాసన మండలి రద్దుపై తెలుగుదేశం పార్టీ నాయకులు సంధించే విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి ఎన్టీ రామారావు ఉదంతాన్ని అడ్డుగా పెట్టుకోవచ్చని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తనను విమర్శిస్తే.. ఎన్టీ రామాారావును విమర్శించినట్టేననే అభిప్రాయాన్ని కలిగించేలా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చని అంటున్నారు.

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ వికేంద్రీకరణ బిల్లు. శాసనసభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు మండలిలో బ్రేక్ పడింది. టీడీపీకి మెజారిటీ సభ్యులు ఉన్నందున.. ఆమోదాన్ని పొందలేకపోయింది. ఈ వ్యవహారం అంతా వైఎస్ జగన్‌ను అసహనానికి గురి చేసిందని, అందుకే- ఏకంగా శాసన మండలినే రద్దు చేసే స్థితికి, కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం కావచ్చనీ అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: