అటు రాజకీయాల్లోనూ... ఇటు సినిమాల్లోనూ రెండు పడవల మీద ప్రయాణం చేసేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిద్ధమైపోయాడు. రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉంటున్న పవన్ తనని ఇప్పటి వరకు ఆదరించిన సినీ పరిశ్రమను కూడా వదలకుండా రెండిటికీ సమయం కేటాయించాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే చాలా రోజులు నుంచి పవన్ సినిమాల్లోకి వస్తారనే ప్రచారం జరిగినా ఎవరు దీనిపై స్పందించలేదు. దీంతో ఇదంతా వట్టి పుకారేనని అంతా కొట్టిపారేశారు. కానీ అకస్మాత్తుగా ఎటువంటి హంగు, ఆర్బాటం లేకుండా పింక్ సినిమా రీమేక్ షూటింగ్ లో పవన్ పాల్గొన్నారు.


 ఇక చాలా రోజుల తర్వాత పవన్ షూటింగ్ కు హాజరుకావడంతో ఎక్కడ లేని సందడి నెలకొంది. పవన్ షూటింగ్ కు సంబంధించి ఎన్ని పగడ్బందీ చర్యలు తీసుకున్నా... షూటింగ్ స్పాట్ నుంచి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో పవన్ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అనే విషయం క్షణాల్లో అందరికీ చేరిపోయింది. అయితే ఇదంతా ముందు వేసుకున్న షెడ్యూల్ ప్రకారమే జరిగింది. ప్రస్తుతం పవన్ కు పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 


ఒక వైపు రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమయంలో రాజకీయంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో సినిమా షూటింగ్ కూడా మొదలవడంతో పవన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మొదటి రోజు షూటింగ్ లోనే అనేక మార్పులు చేసుకున్నారు. తెల్లవారుజామున షూటింగ్ మొదలు పెట్టి .. త్వరగా ముగించేయాలని అకస్మాత్తుగా దిల్ రాజుకి పవన్ చెప్పడంతో ఆయన అంతే హడావుడిగా ఏర్పాట్లు చేసుకుని మధ్యాహ్నానికి షూటింగ్ పూర్తి చేశారు. పవన్ రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ యాక్టివ్ గా ఉండడంవల్ల ఖచ్చితంగా ఆ ప్రభావం ఈ రెండిటిపైనా చూపిస్తుందని అంతా భావిస్తున్నారు.


 పవన్ పొలిటికల్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ సమయంలో మార్పు చేర్పులు జరుగుతాయి కాబట్టి, ఈ సినిమా నిర్మాత, దర్శకులకు కొత్త తలనొప్పులు ఉండబోతున్నాయి. ఇక ఈ సినిమాకు రాజకీయ సెగ తగిలే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: