టీడీపీలో అంతర్గతంగా ఉన్న లుకలుకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయా.. పార్టీలోని అసంతృప్తులు తమ చేష్టలతో నిరసన వ్యక్తం చేస్తున్నారా.. అనే ప్రశ్నలకు తాజా పరిస్థితులు ఔననే సమాధానం ఇస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల అంశంపై ఈరోజు కౌన్సిల్ లో నలుగురు టీడీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి, అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. మండలిలో ప్రవేశపెట్టిన రూల్ 71 నోటీస్‌పై ఓటింగ్ కు ఇద్దరు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయగా, ఒకరు రాజీనామా, మరొకరు సభకు హాజరుకాలేదు. దీంతో టీడీపీ పార్టీకి పెద్ద దెబ్బే తగిలినట్టైంది.

 

 

శాసనమండలిలో ప్రవేశపెట్టిన రూల్ 71 తీర్మానం నెగ్గింది. ఏపీ శాసనమండలిలో రూల్ నెంబర్ 71పై ఓటింగ్ లో టీడీపీకి అనుకూలంగా 27 మంది ఓటింగ్ ఇచ్చి పార్టీకి అండగా నిలిచారు. వ్యతిరేకంగా 11 మంది ఓటింగ్ వేశారు. వారిలో ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాగిరెడ్డి టీడీపీకి హ్యాండిచ్చి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఇలాంటి ముఖ్యమైన సమయంలో తన పదవికి రాజీనామా చేసి సంచలనం రేపారు. మరో ఎమ్మెల్సీ శమంతకమణి సభకు హాజరు కాలేదు. దీంతో ఓటింగ్ నెగ్గినా పార్టీలోని కొందరు ఎమ్మెల్సీల వ్యవహారం టీడీపీకి మింగుడుపడడం లేదు.

 

 

గత ఏడు నెలల్లో టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారు ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయకపోయినా టీడీపీకి వ్యతిరేకంగా ఉండి తమను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని కూడా స్పీకర్ ను కోరారు. మరికొందరు నాయకులూ పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీల్లో డొక్కా మినహా మిగిలిన వారు తమ పదవులకు రాజీనామా చేయకపోయినా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. శమంతకమణి సభకు ఎందుకు గైర్హాజరయ్యానేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ పరిణామం టీడీపీకి ఓ కుదుపులాంటిదే అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: