ప్రభుత్వం సాంకేతికం గా , నైతికం గా కూడా ఓడి పోయిందని  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణ బయట మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. బుధవారం శాసనమండలిలో బిల్స్ పై చర్చ కూడా పెట్టకూడదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బిల్స్ పై వోటింగ్ పెడితే ఇతర సభ్యులు కూడా మాకు మద్దతుగా నిలుస్తారని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేయలేదని చెప్పారు. మా దగ్గర ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయని పరోక్షంగా సీఎం జగన్ ను హెచ్చరించారు. నేటి వోటింగ్ లో గెలవని ప్రభుత్వ ప్రతిపాదన...రేపు ఎలా నిలుస్తుందని సూటిగా ప్రశ్నించారు. 

వాస్తవానికి మూడు రాజధానుల బిల్లుపై ఇంకా శాసనమండలి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ప్రభుత్వం ఈ బిల్లును మండలిలో ప్రవేశపెట్టింది.దీనికి వ్యతిరేకంగా టీడీపీ పెట్టిన రూల్ 71 తీర్మానంపైనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ తీర్మానం తర్వాత బిల్లును చర్చకు స్వీకరించి, దానిని శాసన మండలి వ్యతిరేకిస్తే.. ఆ బిల్లు తిరిగి అసెంబ్లీకి వెళుతుంది.నిబంధనల ప్రకారం.. రెండోసారి అదే బిల్లును శాసనసభ ఆమోదిస్తే, మళ్లీ బిల్లు శాసన మండలికి వెళుతుంది. రెండోసారి కూడా మండలి బిల్లును తిరస్కస్తే, నిబంధనల ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు.దీనికి గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత చట్టంగా మారుతుంది. 

టీడీపీ, వైసీపీల వ్యూహాలు ఏంటి..? అన్నది రాజకీయ విశ్లేషకులు జుట్టు పీక్కుంటున్నారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు శాసన మండలిలో కనుక ఆమోదం పొందకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఈ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చరిత్రలో తొలిసారి రూల్ 71ను ఉపయోగించి తీర్మానాన్ని పెట్టింది. శాసన మండలిలో మొత్తం స్థానాల సంఖ్య 58.ఇందులో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది.

టీడీపీ ఎమ్మెల్సీలు 34 మంది. అధికార వైసీపీ ఎమ్మెల్సీలు 9 మంది కాగా, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆరుగురు, స్వతంత్ర ఎమ్మెల్సీలు ముగ్గురు, బీజేపీ ఎమ్మెల్సీలు ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాగా రూల్ 71 పై వోటింగ్ లో టీడీపీకి మద్దతుగా నిలవని ఇద్దరు సొంత పార్టీ ఎమ్మెల్సీలు. ప్రభుత్వానికి అనుకూలం గా ఓటు వేసిన పోతుల సునీత, శివనాథ రెడ్డిలు. ఈ ఓటింగ్ లో  టీడీపీకి 27 , వైసీపీకి 11 ఓట్లు వచ్చాయి. రూల్ 71 చర్చలో టీడీపీ విజయం సాధించింది. బిల్స్ పై రేపు చర్చ జరగనున్నది. అప్పుడు కూడా జయం తమదేనని తెదేపా నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: