సమస్యలు అన్నీ ఒక్కసారిగా కట్టకట్టుకుని మీద పడిపోతున్నాయి అనే ఫీలింగ్ టిడిపి అధినేత చంద్రబాబులో బాగా కనిపిస్తోంది. అధికార పార్టీని ఇబ్బంది పెడదామని చూస్తున్న సమయంలో తమ సొంత పార్టీ నాయకుల కారణంగా అభాసుపాలవ్వడం ఇప్పుడు తట్టుకోలేక పోతున్నారు. ఒకపక్క అధికారం కోల్పోవడమే కాకుండా, తన కొడుకు వయసు ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, తన పైన విమర్శలు చేస్తుండడం బాబుకి రుచించడంలేదు. అయితే ఇదే సమయంలో అధికార పార్టీని ఇబ్బంది పెట్టేలా ప్రజా పోరాటాలు చేస్తూ, ముందుకు వెళుతుంటే అదే సమయంలో సొంత పార్టీ నాయకులు దెబ్బ కొట్టడం బాబు ఇబ్బందికరంగా మారింది.


రాజకీయాల్లో నాయకులు పార్టీ మారడం అనేది సర్వసాధారణంగా జరిగే తంతు. దీనిని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు గత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఇతర పార్టీ నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులను చంద్రబాబు తన పార్టీలు చేర్చుకుని వారిలో కొంతమందికి మంత్రిపదవులు కూడా ఇచ్చాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి ఆదరణ పెరుగుతున్న పరిస్థితులను చూసి తట్టుకోలేని బాబు ప్రజా ఉద్యమాల పేరుతో ప్రజల్లో హడావుడి చేయడం మొదలు పెట్టారు. 


కొద్ది నెలల క్రితం ఏపీలో నెలకొన్న ఇసుక కొరత పై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలని బాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే విజయవాడలో ఇసుక దీక్షను చేపట్టారు. సరిగ్గా అదే రోజు టీడీపీ నుంచి బయటకి వచ్చిన గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆ సందర్భంగా టీడీపీ పైనా, ఆ పార్టీ అధినేత ఆయన చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అప్పుడు బాబు చేపట్టిన దీక్ష గురించి ఎవరూ చర్చించుకోకుండా అంతా వంశీ టాపిక్ పైనే దృష్టిపెట్టారు.

 

ప్రస్తుతం రాజధాని అమరావతిపై ఉద్యమం పేరుతో తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్న సమయంలోనూ ఇదే తరహాలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి టీడీపీ కి గుడ్ బాయ్ అని చెప్పారు. అంతేకాదు, రాజధాని వికేంద్రీకరణను ప్రజా ప్రయోజనం ఆశించేవారు ఎవరైనా స్వాగతిస్తారని అన్నారు. ఇక మూడు రాజధానుల బిల్లు ఏపీ అసెంబ్లీ లో పాస్ అవ్వగా శాసన మండలి లో కూడా ఆ బిల్లు ఆమోదం పొందాలి. సరిగ్గా సమయం చూసుకుని ఎమ్మెల్సీ, గుంటూరు జిల్లాకే చెందిన ఎస్సీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ మండలికి హాజరు కాకుండా పరోక్షంగా అధికారపార్టీకి మేలు చేశారు. అలాగే మహిళా ఎమ్మెల్సీలు శమంతకమణి, రత్నాబాయ్ కూడా మండలి సమావేశాలకు హాజరు కాకుండా షాక్ ఇచ్చారు. ఇలా ప్రతి సందర్భంలోనూ బాబు కి సొంత పార్టీ నేతలు షాక్ ఇవ్వడం అలవాటైపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: