శాసనమండలిని జగన్మోహన్ రెడ్డి రద్దు చేసేస్తారనే ప్రచారం మొత్తం ఎంఎల్సీల్లోనే టెన్షన్ పెంచేస్తోంది. ఈ ప్రచారం ఇటు తెలుగుదేశంపార్టీ నేతల్లోనే కాదు అటు సొంత పార్టీ నేతలకు కూడా షాక్ ఇచ్చింది. వైసిపి నేతల బాధేమిటంటే వస్తుందని అనుకుంటున్న పదవులు పోతోందేమో అని. అదే సమయంలో టిడిపి నేతల బాధేమిటంటే ఉన్న పదవులు పోతాయేమోనని. ఇంతకీ విషయం ఏమిటంటే శాసనమండలి రద్దుకు జగన్ నిర్ణయం తీసేసుకున్నాని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం  అన్నీ పార్టీల్లోను సంచలనంగా మారింది.

 

శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58.  ఇందులో టిడిపికి 26 మంది సభ్యులు, వైసిపికి తొమ్మది మంది సభ్యులున్నారు. పిడిఎఎప్ కు ఐదుగురు, బిజెపికి ముగ్గురు సభ్యులు, స్వతంత్రులు నలుగురున్నారు. మిగిలిన స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. మెజారిటి ఉంది కదా అన్న ధీమాతో టిడిపి మండలిలో ప్రతి చిన్న విషయానికి ఓవర్ యాక్షన్ చేస్తోంది.

 

అసెంబ్లీలో పాసైన బిల్లులను కూడా శాసనమండలిలో టిడిపి అడ్డుకుంటోంది. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టే బిల్లును  అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. కానీ మెజారిటి ఉందన్న ఏకైక కారణంతో మండలిలో టిడిపి ఓడించింది. తాజాగా మూడు రాజధానుల బిల్లును కూడా మండలిపై  చర్చకు రాకుండానే  టిడిపి అడ్డుకున్నది.

 

టిడిపి వైఖరితో జగన్ కు ఒళ్ళు మండిపోయింది. అందుకనే అసలు శాసనమండలినే రద్దు చేసేస్తే సరిపోతుందని నిర్ణయించారట. మండలి రద్దైతే మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణతో పాటు మరో ఏడుమంది వైసిపి సభ్యులు కూడా నష్టపోతారు. నష్టపోయే వాళ్ళకు జగన్ ఏదో ఓ విధంగా సర్దుబాటు చేస్తారు లేండి. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే నారా లోకేష్ తో కలిపి  టిడిపి కీలక నేతలందరూ సభ్యత్వాలు కోల్పోతారు.  దాదాపు రెండేళ్ళ పదవీ కాలాన్ని చాలామంది సభ్యులు ముందుగానే కోల్పోతున్నారు. మరి మెజారిటి ఉంది కదా అని ఓవర్ యాక్షన్ చేస్తే అసలుకే మోసం వస్తుందని టిడిపి ఊహించినట్లు లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: