ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాలలో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని అన్నారు. రాష్ట్రంలోని రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ పార్టీ గెలవలేదని ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ మరో నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలిచిందని జగన్ చెప్పారు. 
 
వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మేలు చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న పథకాలకు జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా మద్దతు పలికే పరిస్థితి ఉందంటూ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీలకు వేరువేరు కమిషన్లకు సంబంధించిన బిల్లు సభలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత జగన్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి వైసీపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు. 
 
ఎస్సీ నియోజకవర్గం నుండి ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేను చూసి ఎస్సీలందరూ ఎందుకు ఓటు వేశామా అని అనుకుంటున్నారని జగన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ లకు వేరు వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని శాసనమండలిలో అడ్డుకుంటోందని ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్నది చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం మరియు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. 
 
అందుకే ఆ వర్గాలకు చెందిన వారికి ఆరు మంత్రి పదవులు ఇచ్చామని జగన్ చెప్పారు. ఆ వర్గాలకు చెందిన వారే ఇద్దరు ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని అన్నారు. మూడు ప్రత్యేక కార్పొరేషన్లను దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీల కొరకు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలను విడదీసి లబ్ధి పొందాలని చూస్తున్నారని జగన్ అన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వైసీపీకి మద్దతు తెలుపుతున్నారని జగన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఇది షాక్ అనే చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: