జగన్ సర్కారుకు తెలుగుదేశం పెద్ద షాక్ ఇచ్చేసింది. తనకు బలం ఉన్న మండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ రెండు బిల్లులను మండలిలో ప్రవేశ పెట్టకుండా ఆలస్యం చేసింంది. ఇందుకు అస్త్రంగా రూ. నెంబర్ 71 ను వాడుకుంది. దీంతో ఇప్పుడు ఈ రూ. నెంబర్ 71 ఏంటో అర్థం చేసుకునేందుకు అంతా ప్రయత్నిస్తున్నారు.

 

అసలు ఈ రూల్ నెంబర్ 71 ఏంటో చూద్దాం.. ఈ నిబంధన ప్రకారం... మంత్రివర్గం తీసుకున్న ఏదైనా నిర్ణయాన్ని తాము ఆమోదించడం లేదంటూ ఛైర్మన్‌ అనుమతితో సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. దీని కోసం సభ మొదలవడానికి ముందే కార్యదర్శికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. తీర్మానం నిబంధనలకు అనుగుణంగానే ఉందని ఛైర్మన్‌ భావిస్తే.. దానికి మద్దతిస్తున్న సభ్యుల్ని లేచి నిలబడమని కోరతారు. ఈ తీర్మానానికి కనీసం 20 మంది మద్దతిస్తే... అప్పటినుంచి 7 రోజుల్లోగా ఎప్పుడైనా దానిపై చర్చకు అనుమతించవచ్చు.

 

ఇప్పుడు తెలుగుదేశం ఇదే అస్త్రాన్ని ప్రయోగించింది. కీలక బిల్లుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు శాసన మండలిలో టీడీపీ రూల్‌ నెం.71 అస్త్రాన్ని ప్రయోగించింది. రాష్ట్రంలో ఈ నిబంధనతో ప్రభుత్వ బిల్లుల్ని అడ్డుకునేందుకు విపక్షం శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అయితే ఈ రూల్ నెంబర్ 71తో తామేదీ మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నామని సంబరపడుతోంది. అయితే మండలిలో ఆధిక్యం ఉండటం ద్వారా ఈ బిల్లుల ఆమోదాన్ని కొంత ఆలస్యం చేయవచ్చేమో కానీ.. అడ్డుకోలేవని తెలుసుకోవాలి.

 

ఇలాంటి చర్యల వల్ల జగన్ ను రెచ్చగొడితే అది తమకే నష్టం అన్న విషయాన్ని తెలుగుదేశం గ్రహించడం లేదు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు టీడీపీకి ఈ బిల్లుపై ఓటింగ్ విషయంలో ఝలక్ ఇచ్చారు. వైసీపీకి అనుకూలంగా ఓటేశారు. మిగిలినవాళ్లను, 21 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చంద్రబాబుకు తలనొప్పిగా మారొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: