నిన్నటి రోజున శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ శతవిధాలా ప్రయత్నం చేసింది.  చివరకు బిల్లును అడ్డుకుంది.  ఈ బిల్లుపై చర్చ జరగాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు ఉపయోగించుకునే అధికారం రాజ్యాంగం రూల్ నెంబర్ 71 ద్వారా ఇచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును చర్చించే విషయంపై మొదటిసారిగా ఈ అధికారాన్ని తెలుగుదేశం పార్టీ వినియోగించుకొని బిల్లు మండలిలోకి వచ్చే ముందే నోటీసులు ఇచ్చింది.  


మొదట బిల్లుపై చర్చ జరగాలి అనుకున్నా దానికి తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది.  ఈ వాదోపవాదాల మధ్య సాయంత్రం 6:30 గంటల వరకు బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి దొరకలేదు.  ముందుగా రూల్ నెంబర్ 71 తీర్మానంపై పై చర్చ జరగాలని, ఆ తరువాత బిల్లుకు అనుమతి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది.  అయితే నాటకీయ పరిణామాల మధ్య మొదట రూల్ నెంబర్ 71 తీర్మానంపై చర్చ జరిపారు.  ఓటింగ్ నిర్వహించారు.  


ఈ ఓటింగ్ లో వ్యతిరేకంగా 27 మంది ఓటు వేయగా, అనుకూలంగా 11 మంది ఓటు వేశారు.  తటస్థంగా 9 మంది ఓటు వేశారు.  దీంతో బిల్లుకు చర్చించే అంశం బుధవారానికి వాయిదా వేశారు.  అయితే, ఈ బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ సెలక్ట్ కమిటీకి బిల్లును పంపాలని అనుకుంటోంది.  ఒకవేళ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపినట్టయితే కనీసం రెండు నెలల సమయం పెట్టె అవకాశం ఉన్నది.  మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఈ బిల్లును సమర్ధవంతంగా అడ్డుకున్నది.  


శాసనమండలిలో అడ్డుకున్నా ఈరోజు దీనిగురించి చర్చ జరగొచ్చు.  ఈ చర్చలు తరువాత బిల్లును ఆమోదిస్తారా లేదంటే మండలి నుంచి తిరిగి శాసనసభకు పంపుతారా అన్నది చూడాలి.  అయితే, ప్రభుత్వానికి చుక్కెదురు కావడంతో మండలిపై సీరియస్ గా ఉన్నది.  ఎలాగైనా సరే మండలిలో ఈరోజు ఆమోదం పొందేలా చూసేందుకు వైకాపా వ్యూహం రచిస్తోంది.  నిన్నటి రోజున 15 మంది మంత్రులు శాసనమండలిలో ఉండగా, ఎమ్మెల్యేలు గ్యాలరీలో కూర్చున్నారు.  సభ పూర్తయ్యే వరకు అందరు అక్కడే ఉన్నారు.  రాత్రి వరకు మండలి సమావేశం జరిగితే కొన్ని చానళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: