జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆరేళ్ల క్రితం పార్టీ పెట్టిన నాయకుడు. ఇప్పటి వరకూ ఒక్క ప్రత్యక్ష ఎన్నికల్లో వ్యక్తిగతంగా గెలిచిన చరిత్ర లేదు. అసలు 2014 ఎన్నికల్లో పోటీయే చేయలేదు. ఆయన కానీ.. ఆయన పార్టీ గానీ.. ఆ తర్వాత 2019 ఎన్నిల్లో కాబోయే సీఎం తానే అంటూ ప్రగల్భాలు పలికాడు. ఎందుకైనా మంచిదని రెండు స్థానాల్లో పోటీకి దిగాడు. పాపం.. రెండు చోట్లా ఓడిపోయాడు.

 

మరి నాయకుడే గెలవకపోతే.. ఇక ఆ పార్టీ తరపున ఇంకెవరు గెలుస్తారు. 100కు పైగా సీట్లలో పోటీ చేస్తే.. పవన్ పార్టీ గెలుచుకుంది ఒకే ఒక్క సీటు. అది కూడా అధినాయకుడు కాదు. ఇప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా పవన్ కు హ్యాండ్ ఇస్తున్నాడు. పోపోవోయ్.. ఓడిపోయిన నువ్వు నాకు చెప్పేదేంటని ఇన్ డైరెక్టుగా చెప్పేస్తున్నాడు. ఇదీ పవన్ చరిత్ర. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఇంత జరిగినా.. జనాలు ఇంతా ఓడించినా మన మీడియా హీరో మాత్రం పవన్ కల్యాణే.

 

ఆయన ఏం మాట్లాడిన కొన్ని ఛానళ్లలో నిరంతరం లైవ్ ఇస్తారు. ఎప్పుడూ చెప్పే ఆ పాత కబుర్లే ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు. ఆయన ఏమన్నా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పతాక శీర్షికలకు ఎక్కుతుంది. మరి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు మీడియా విలువ ఇవ్వదా అంటే.. మీడియాకు జనం నిర్ణయంతో పని లేదు. తాము ఎవరిని హీరో చేయాలనుకుంటే వారే హీరో అవుతారు.

 

మరి ఎల్లో మీడియాగా చెప్పుకునే చంద్రబాబు అనుకూల మీడియాకు పవన్ అంటే ఎందుకంత ముద్దు.. ఎందుకంటే.. ఆయన తమ ప్రత్యర్థి జగన్ ను తిడతాడు కాబట్టి. తమ వాయిస్ వినిపిస్తాడు కాబట్టి.. ఇదీ ఎల్లో మీడియా నీతి. అంటే జగన్ ను తిట్టేవాడు ఎవడైనా ఓకే.. వాడికి ప్రజాబలం లేకున్నా ఓకే. ప్రజావాణి వినిపించకున్నా ఓకే. తమ మీడియాలో ప్రముఖంగా రావాలంటే ఒకే ఒక్క క్వాలిఫికేషన్ ఉండాలి. అదే జగన్ ను తిట్టాలి. అంతేగా.. అంతేగా..

మరింత సమాచారం తెలుసుకోండి: