అరేయ్.. ఒరేయ్.. ఏరా.. మామా.. చిచ్చా.. కాకా.. ఇవీ ఫ్రెండ్స్ సరదాగా పిలుచుకునే పిలుపులు. అయితే కొందరు కుర్రాళ్లకు ఈ పిలుపులు నచ్చవు. అది వారి స్నేహాన్ని బట్టి ప్రవర్తన బట్టి ఉంటుంది. హైదరాబాద్ లో విచిత్రంగా అలా ఒరేయ్ అని పిలవొద్దు అన్నందుకు ఓ స్నేహితుడు హత్యకు గురయ్యాడు. అలా అన్నందుకు కోపం వచ్చిన తోటి స్నేహితుడు ఏకంగా బీరు బాటిల్ పగలకొట్టి స్నేహితుడి గొంతులో పొడిచేశాడు.

 

అలా ఒరే' అనే పదం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మద్యం తాగుతున్న స్నేహితుల మధ్య తలెత్తిన ఈ ఒరే వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

 

మూసాపేట యాదవబస్తీలో చలం, లక్ష్మీ కుటుంబం నివాసముంటోంది. కూలి పని చేసుకుని జీవించే వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుధీర్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో స్నేహితులతో బయటకు వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. తర్వాత పోచమ్మ ఆలయ ఆవరణలో సుధీర్ అతని మిత్రులైన
సాబేర్, గురజాల కిరణ్, నవీన్, రాంబాబు, హర్షవర్గన్లతో అర్ధరాత్రి దాకా మద్యం తాగారు.

 

ఆ సమయంలో సుధీర్‌ను సాబేర్ 'ఒరే అని సంభోదించినట్లు తెలుస్తోంది. తనను అలా పిలవొద్దని సుధీర్.. సాబేరుకు చెప్పాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పెద్దదిగా మారిన ఈ వివాదాన్ని నిరోధించడానికి వారి మిత్రులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతే.. ఆవేశానికి లోనైన సాబేర్ బీరు సీసా పగులగొట్టి సుధీర్ గొంతులో పొడిచేశాడు. సుధీర్ అక్కడిక్కడే కుప్పకూలాడు. వెంటనే సుధీర్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: