ఇంకా చంద్రయాన్ యుగంలోనూ చేతబడి, చిల్లంగి, బాణామతిలను నమ్మే వారు ఉన్నారా.. అంటే ఇంకా ఉన్నారు. అంతే కాదు.. మరో విచిత్రం ఏంటంటే.. టెక్నాలజీ ద్వారా ఏర్పడిన గూగుల్ లో ఈ చేతబడి చేసే వారి గురించి వెదికి మరీ వారిని ఆశ్రయిస్తున్నారు. డబ్బు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి విచిత్రమే జరిగింది.

 

హైదరాబాద్ లోని సైదాబాద్లో నివాసముంటున్న యువతి నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తోంది. కొద్దినెలల నుంచి ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాలుగైదు సంబంధాలు తప్పిపోయాయి. ఆమెకు పరిచయమున్న ఓ మహిళ నీకు ఎవరైనా చేతబడి చేసుంటారేమో...అందుకే పెళ్లి కాలేదంటూ చెప్పింది. ఈ మాటలకు ప్రభావితురాలైన యువతి.. వెంటనే గూగులను శోధించింది.

 

అందులో ఒక ఫోన్ నంబరు లభించగా... వెంటనే ఫోన్ చేసింది. చేతబడులకు విరుగుడు చేస్తామంటూ చెప్పారు. ఆమె వివరాలను తెలుసుకున్నారు. "మీపై చేతబడి చేయించారు. చేతబడి చేయించినవారు మీకు తెలీదు. శాంతిహోమం ద్వారా క్షుద్రశక్తులను వెళ్లగొడతాం..పూజలను నిర్వహించాలి.. డబ్బు పంపించండంటూ సైబర్ నేరస్థులు పాతబస్త్రీలోని ఓ ప్రైవేటు ఉద్యోగినిని మోసం చేశారు.

 

చేతబడి చేయించడం వల్లే పెళ్లి కాలేదని నమ్మేలా కట్టుకథలు చెప్పారు. అనంతరం ఆమె నుంచి విడతలవారీగా రూ.1.40లక్షలు జమచేయించుకున్నారు. చేతబడి లేదు.. క్షుద్రపూజలు లేవని ఆమె స్నేహితురాలు హితబోధ చేయడంతో వాస్తవాన్ని గ్రహించిన యువతి.. సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

 

హైదరాబాద్ యువతిని మోసం చేసిన వ్యక్తులు పంజాబ్ నుంచి నిందితులు మాట్లాడారని గుర్తించారు. బాధితురాలు జమచేసిన బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకుంటున్నారు. ఇలాంటి సైబర్ కేటు గాళ్లతో కాస్త జాగ్రత్త. మీకూ ఇలాంటి వాళ్లు తారసపడొచ్చు. వారి మాయలో పడకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: