ఈరోజు ఉదయం 7 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 9 కార్పొరేషన్లకు, 120 మున్సిపాలిటీలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ప్రభుత్వం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కార్మికులకు, ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. జనవరి 25వ తేదీన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. 
 
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలీంగ్ అంతటా ప్రశాంతంగా కొనసాగుతోంది. కానీ తెలంగాణ బీజేపీ నేత, మాజీ మంత్రి, గద్వాల్ మాజీ ఎమ్మెల్యే డికె అరుణకు సంబంధించిన ప్రాంతమైన గద్వాల్ లో మాత్రం ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇరు పార్టీల నేతలు దాడికి దిగడంతో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ శంకర్ కు ఈ ఘటనలో తీవ్రగాయాలయ్యాయి.                       
 
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఇరు వర్గాలు చెదిరిపోయాయి. గద్వాల్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం దగ్గర కాంగ్రెస్ - తెరాస పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి రంగప్రవేశంతో ఇరు వర్గాలు అక్కడినుండి వెళ్లిపోయాయి. డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పటంతో పాటు విధుల్లో ఉన్న సిబ్బందికి సహకరించాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రముఖులు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నల్గొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: