తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ సంద‌డి కొన‌సాగుతోంది. రాష్ట్రంలోని 2,647 మున్సిపాలిటీల వార్డులు, 324 కార్పొరేషన్‌ వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌శాంతంగా పోలింగ్ స‌ర‌ళి కొన‌సాగుతోంది. కాగా, ఈ ఎన్నిక‌ల గురించి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి మీడియాకు వివ‌రించారు. ఓటుహక్కు ఉన్న ప్రతిఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  మున్సిపల్‌ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుచేశామని తెలిపారు. 

 


ఎన్నికల్లో ధనప్రవాహం పెరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, చాలావరకు ఎస్‌ఈసీ తరఫున కట్టడిచేశామని కమిషనర్‌ నాగిరెడ్డి  చెప్పారు. ఎన్నికల్లో ప్రలోభాలు, ధనప్రవాహాన్ని అడ్డుకోవడంలో రాజకీయపార్టీలు, పోటీలో ఉండే అభ్యర్థులు ప్రధానంగా చొరవ తీసుకోవాలని కోరారు. పెద్దపల్లిలో డబ్బు పంపిణీని వీడియో రికార్డుచేశారని, తాము వెంటనే కేసు బుక్‌చేశామని చెప్పారు. డబ్బులు పంపిణీ చేసేవారు ఆధారాలతో పట్టుబడితే.. వారు గెలిచినా అనర్హత వేటువేసే అధికారం ఎస్‌ఈసీకి ఉందని కమిషనర్‌ నాగిరెడ్డి అన్నారు. పోటీచేసే అభ్యర్థులు ఖర్చును తప్పుగా చూపించినా కూడా వారిపై కూడా అనర్హత వేటు వేస్తామని నాగిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు అభ్యర్థుల ఖర్చును రోజువారీగా నోటీసుబోర్డులో ప్రదర్శిస్తున్నామని కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు.

 

ఈ సంద‌ర్భంగా దొంగ ఓట్ల గురించి కమిషనర్‌ నాగిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఒక్క దొంగ ఓటుపడినా రీపోలింగ్‌ నిర్వహిస్తామని  తెలిపారు. పలు అంచెల్లో ఓటర్ల వివరాలను తనిఖీ చేస్తున్నామని, దొంగ ఓట్లు పడకుండా పకడ్బందీగా చర్యలుచేపట్టామన్నారు. దొంగ ఓట్లు వేసే వారిపై, వారికి సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. టెండర్‌ ఓటు నమోదైతే.. దొంగ ఓటు పడినట్టు రుజువవుతుందని చెప్పారు.

 

 

ఇక అభ్య‌ర్థుల విష‌యంలోనూ కమిషనర్‌ నాగిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర మొత్తం రిటర్నింగ్‌ అధికారుల దగ్గర ఉంటుందని, వాటిని కూడా నోటీసుబోర్డులపై ఉంచుతామని చెప్పారు. ఓటర్లు అభ్యర్థుల గురించి తెలుసుకొని మంచి వ్యక్తికి ఓటువేసి గెలిపించుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నట్లు తేలినా రీపోలింగ్‌ జరుపుతామన్నారు. ఎన్నికల్లో రాజకీయ నాయకుల డబ్బుల పంపిణీ కాగ్నిజబుల్‌ అఫెన్స్‌ (విచారణార్హమైన తీవ్రమైన నేరం) కిందకు రావడం కొంత వరకు సమస్యగా మారిందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: