అవును.. చంద్రబాబు ముఖంలో నవ్వు చూసి ఎన్నాళ్లయ్యింది.. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పాపం. చంద్రబాబు మొహం మాడిపోయే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అదే పరిస్థితి. కొత్త సీఎం జగన్ సీటులో కుదురుకోక ముందే చంద్రబాబుకు చుక్కలు చూపించడం ప్రారంభించారు. వరుస పంచ్ లతో అదరగొట్టేస్తున్నాడు. దాంతో ఆయన ముఖంలో ఆనందం కరవైంది.

 

మళ్లీ ఇన్నాళ్లకు చంద్రబాబు ముఖంలో సంతోషం వెల్లివిరుస్తోంది. ఈ ఆనందానికి కారణం ఏంటో తెలుసా.. శాసనమండలిలో ప్రభుత్వంపై పై చేయి సాధించడమే. మండలి పరిణామాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంతోషపడుతున్నారు. ప్రభుత్వం నైతికంగా సాంకేతికంగా ఓడిపోయిందని చంద్రబాబు అంటున్నారు. మూడు రాజధానుల బిల్లులపై మండలిలో చర్చ కూడా పెట్టకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ బిల్లులపై ఓటింగ్ పెడితే ఇతర పార్టీల ఎమ్మెల్సీలు కూడా తమకు మద్దతు ఇస్తారని ఆయన అన్నారు.

 

అంతే కాదు.. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు విషయంలో ఏమీ చేయలేదని నమ్మకంగా చెబుతున్నారు. ఇలాంటివి ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. రూల్ 71 కింద గెలవని ప్రభుత్వం ఎలా బిల్లులపై గెలుస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. నాటకీయ పరిణామాల మధ్య శాసన మండలిలో టీడీపీ ప్రవేశపెట్టిన రూల్‌ 71 తీర్మానం నెగ్గడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో అసెంబ్లీ ఆవరణ బయట చిట్ చాట్ నిర్వహించారు.

 

ఆ సమయంలో చంద్రబాబు ముఖం మతాబులా వెలిగిపోయిందట. ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా కూడా ఓడిపోయిందని చంద్రబాబు మీడియాతో అన్నారు. బుధవారం బిల్లులపై చర్చ కూడా పెట్టకూడదంటున్నారు. అయితే ఈ సంతోషం ఎన్నాళ్లను వేచి చూడాలి. జగన్ మాత్రం ఇబ్బందులు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల బిల్లును గట్టెక్కించి అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అవసరమైతే మండలి రద్దుకు కూడా సిద్ధమే అంటున్నారని తెలుస్తోంది. మరి ఈ రాజకీయం ఏమలుపు తిరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: