పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మారుస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకించిన తెలుగు అగ్రశ్రేణి దినపత్రిక ఈనాడు తాజాగా జగన్ సర్కారుపై నిప్పులు చెరిగింది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం కోసం ఎదురు చూస్తున్న వేళ.. తూటాల్లాంటి పదాలతో జగన్ సర్కారు నిర్ణయాన్ని తప్పుబడుతూ సంపాదకీయం రాసింది.

 

చంద్రబాబు సర్కారు రాజధానిగా గుంటూరు-కృష్ణా జిల్లాల్లో ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నవేళ.. రాజధాని నగరానికి అమరావతి అని పేరు పెడితే బావుంటుందని ఈనాడు పత్రిక సంపాదకుడు రామోజీరావు ఓ ప్రత్యేక వ్యాసం రాశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు అదే పేరు రాజధానికి పెట్టారు. ఒకరకంగా తాను పేరు పెట్టిన అమరావతి నగరం నుచి రాజధానిని జగన్ మారుసున్నవేళ ఈనాడు దినపత్రిక ఘాటు పదజాలంతో ఎడిటోరియల్ రాసింది.

 

అందులో మచ్చుకు కొన్ని ఈటెల్లాంటి పదాలు, వాక్యాలు ఇవే..

 

“ ‘అమరావతికి అన్యాయం చేయడం లేదు, తక్కిన ప్రాంతాలకు న్యాయం చేస్తు న్నా’మన్న కపట నాటక మాటకచేరి చట్టసభలో మోతెక్కుతున్నప్పుడే- సీమాంధ్ర కలల రాజధాని నిర్మాణానికి ఏకంగా 34వేల ఎకరాల్ని స్వచ్ఛందంగా రాసిచ్చిన రైతుకుటుంబాలపై సర్కారు లాఠీ కరాళనృత్యం చేసింది.”

 

"అధికారానికి వస్తే అమరావతి సౌభాగ్యాన్ని తుడిచేసి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైకాపా అధినాయకత్వం ఏనాడన్నా చెప్పిందా?”

 

"వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి’ పేరిట ముఖ్యమంత్రి అభీష్ట కామ్యార్థ సిద్ధికి రంగం సిద్ధమైంది. మరో మాటలో, అమరావతి భ్రూణ హత్య సర్కారు సారథ్యంలో నిష్ఠగా సాగుతోంది!”

 

"ఇప్పటికే ఒప్పందాలు ఖరారైన 130 ప్రతిష్ఠాత్మక సంస్థల రాకను డోలాయమానంలో పడేసిన జగన్‌ సర్కారు- రాష్ట్ర భవిష్యత్తునే అక్షరాలా పణం పెడుతోంది. “

 

"ప్రజా రాజధానికోసం ప్రాణప్రదమైన భూముల్నే రైతులు రాసిచ్చేయడం కనీవినీ ఎరుగని త్యాగమైతే- వారితోపాటు, రాష్ట్ర భవితనూ బలిపీఠం మీదకు నెడుతూ జగన్‌ సర్కారు చేసింది అక్షరాలా ప్రజాద్రోహం!”

మరింత సమాచారం తెలుసుకోండి: