గుంటూరు జిల్లాలో మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునివ్వటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు, విద్యార్థి సంఘాలు, రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పోలీసులు ఆందోళనలను అడ్డుకోవటానికి ప్రయత్నాలు చేయడంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేతలు డీఎస్పీ సీతారామయ్య కాలర్ పట్టుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 
 
పోలీసులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్వాదం పెరగడంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గుంటూరు జిల్లాలో విద్యార్థి యువజన ఐకాస ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. విద్యార్థి సంఘాలు ఎన్టీయార్ కూడలి దగ్గర ఆందోళన బాట పట్టాయి. విద్యార్థి సంఘాలు పాఠశాలలకు, కళాశాలలకు వెళుతున్న బస్సులను అడ్డుకున్నాయి. విద్యార్థి సంఘాలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.                
 
గుంటూరు జిల్లా పోలీసులు బంద్ కు ఎలాంటి అనుమతులు లేవని బంద్ వలన ప్రజలు ఇబ్బందులు పడతారని టీడీపీ నేతలకు, విద్యార్థి సంఘాలకు సూచించారు. బలవంతంగా పాఠశాలలను, దుకాణాలను మూయించవద్దని పోలీసులు కోరారు. శాంతి భద్రతలకు ఎటువంటి భంగం వాటిల్లినా ఉపేక్షించమని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు రాజధానుల బిల్లుకు నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. 
 
మరోవైపు సచివాలయం దగ్గర పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఎమ్మెల్సీ స్టిక్కర్లు లేకుండా ఎలా వస్తారని పోలీసులు ప్రశ్నించగా కారులో సభ్యులు ఉన్నప్పుడు స్టిక్కర్లతో పనేంటని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. కొంత సమయం పాటు ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా ఆ తరువాత పోలీసులు వాహనాలను అనుమతించారు. ఫైర్ స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: