ఇంత విచిత్రమైన వాదన చంద్రబాబునాయుడు తప్ప మరొకరు వినిపించలేరేమో ? శాసనమండలిలో జరిగిన ఓటింగ్ లో వైసిపి వాదన ఓడిపోయింది కాబట్టి మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.  మూడు రాజధానుల ప్రతిపాదనకు చట్ట రూపం ఇవ్వటానికి ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

 

మంగళవారం అధికార వికేంద్రీకరణ, ఏపి అభివృద్ధి చట్టం-2020, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు మండలిలో చర్చకు వచ్చాయి.  వచ్చిన బిల్లులపై చర్చించకుండా మెజారిటి ఉంది కాదాని టిడిపి రూల్ 71 పై చర్చకు నోటీసిచ్చి పట్టుబట్టింది. ముందు బిల్లులపై చర్చించాలని వైసిపి కాదు రూల్ 71పైనే చర్చించాలని టిడిపి పట్టుబట్టింది. సరే మంత్రుల వాదన వీగిపోయి టిడిపి వాదన ప్రకారమే చర్చ జరిగింది. తర్వాత ఓటింగ్ కూడా జరిగింది. ఈ ఓటింగులో వైసిపి ఓడిపోయింది.

 

58 మంది స్ధానాలున్న మండలిలో టిడిపికి 26 మంది సభ్యులతో మెజారిటి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. వైసిపికి తొమ్మిది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు.  అసెంబ్లీలో పాసయిన ఏ బిల్లయినా శాసనమండలిలో ఓటింగ్ జరిగితే  వీగిపోతుంది. ఇంతోటి దానికి మండలిలో జరిగిన ఓటింగ్ లో అధికార పార్టీ ఓడిపోయింది కాబట్టి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఎలా డిమాండ్ చేస్తున్నారో అర్ధం కావటం లేదు.

 

చంద్రబాబు వాదనే నిజమైతే మరి అసెంబ్లీలో   సోమవారం ఇవే రెండు బిల్లులు ఎలా పాసయ్యాయి ? వైసిపికున్న మెజారిటితోనే కదా ? అసెంబ్లీలో పాసైనపుడు మరి చంద్రబాబు వాదన వీగిపోయినట్లే కదా ? సంఖ్యాబలం రీత్యా అసెంబ్లీలో పాసయిన బిల్లులకు మెజారిటి ప్రజల ఆమోదం ఉందని అంటే చంద్రబాబు ఒప్పుకుంటారా ?  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మండలిలో టిడిపికి 26 ఓట్లుంటే పడింది 24 మాత్రమే. అంటే రెండు ఓట్లు టిడిపికి వ్యతిరేకంగా పడ్డాయి. మరి చంద్రబాబు దీనికి ఏమని సమాధానం చెబుతారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: