తెలంగాణలో యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీ...రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖరారుపై దృష్టి పెట్టింది ఉన్నత విద్యా మండలి. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో మేనేజ్ మెంట్ కోటా అమలు చేయాలని నిర్ణయించింది. కొత్త కోర్సులతో పాటు...కొత్త సెక్షన్‌ల మంజూరుకు కౌన్సెల్ ఒకే చెప్పింది. ఉన్నత విద్యామండలి నిర్ణయంతో చాలా డిగ్రీ కాలేజీలు మూతపడే ఛాన్స్ ఉంది. 

 

తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్ట్‌ల భర్తీ...రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఖరారుపై ఉన్నత విద్యా మండలి కమిటీ భేటీ అయింది. పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. నియామక ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. గతంలో నియామక ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయని...అలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు పాపిరెడ్డి. 

 

ఇక...డిగ్రీ కళాశాలల్లో మేనేజ్ మెంట్ కోటా అమలు చేయాలనే డిమాండ్ గత కొంతకాలం నుంచి ఉంది. దీనిపై డిగ్రీ కళాశాలలు గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నాయి. అడ్మిషన్‌లు లేని డిగ్రీ కాలేజీలు మాత్రం మేనేజ్‌మెంట్ కోటాని వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఉన్నత విద్యామండలి కూడా ఈ విషయంపై ఇప్పటి వరకూ ఒక నిర్ణయానికి రాలేక పోయింది. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేనేజ్‌మెంట్ కోటా అమలు చేయాలని ఉన్నత విద్యామండలి డిసైడ్ అయింది. ఎంత శాతం సీట్లు కేటాయించాలనేది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 30 శాతం వరకు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కొత్త డిగ్రీ కోర్సులకు అనుమతి ఇవ్వలేదు. కొత్త సెక్షన్స్ కూడా ప్రవేశపెట్టలేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులకు, కొత్త సెక్షన్‌లకు కూడా అనుమతి ఇవ్వాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది ఉన్నత విద్యామండలి. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రిజర్వేషన్లు కూడా అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో అమలు చేయనుంది. దీంతో చాలా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. నాణ్యమైన విద్యను అందించని కళాశాలలను కాపాడాల్సిన బాధ్యత తమది కాదని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపి రెడ్డి అన్నారు. వాటిని క్లోజ్ చేసుకోవాలని కోరినా, మెర్జ్ చేసుకోవాలని చెప్పినా మేనేజ్‌మెంట్లు పట్టించుకోలేదని తెలిపారు పాపిరెడ్డి. మరోవైపు...యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లను త్వరలోనే నియమిస్తామని...ఎలక్షన్ కోడ్ ముగియగానే సీఎం కేసీఆర్ అనుమతితో ఈసీలను వేస్తామని పాపిరెడ్డి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: