దేవుడినీ ప్రతివాదిని చేయండి దైవం పేరుతో అక్రమ కట్టడాలను అనుమతించం అని హైకోర్ట్ తేల్చేసింది. అమీన్‌ పూర్‌ లో ఓ ఆలయ నిర్మాణం కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడు, దేవాలయం రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందేనని, దేవుడినీ రికార్డులోకి తీసుకోవాలని ఆదేశించి సంచలనం సృష్టించింది. 

 

దుకాణం కూలిపోతే బీమా కంపెనీ పరిహారం ఇవ్వడానికి నిరాకరించగా దేవుడిపై కేసు వేసిన ఈ సీన్ చూసి ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. దేవుడిపై కేసులేంటీ అనుకున్నారు. కానీ ఇది సినిమాకే పరిమితం కాదు. దేశంలో ఇన్ని వేల ఆలయాలు, కోట్లమంది భక్తులు ఉన్నచోట, దేవుడు కూడా కోర్టు రికార్డులకు ఎక్కక తప్పదని తేల్చేశారు.

 

ఓ పార్కులో అక్రమంగా ఆలయం నిర్మిస్తున్న విషయంలో తాజాగా హైకోర్టు కూడా అదేలా స్పందించింది. దేవుడినీ ప్రతివాదిగా చేయాలని ఆదేశించింది. దేవుడైనా, దేవాలయమైనా రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పంచాయతీ మాధవపురిహిల్స్లోని రాక్గార్డెన్లో అక్రమంగా దేవాలయాన్ని నిర్మిస్తున్నారంటూ హ్యూమన్ రైట్స్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెల్ అనే సంస్థ గతంలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. 

 

ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ కె.లక్ష్మణ్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. దేవాలయ కమిటీపై ఏం చర్య తీసుకున్నారని విచారణకు వ్యక్తిగతంగా హాజరైన అమీన్పూర్ ఈవోని ప్రశ్నించింది. 2017లో పిటిషనర్లు వినతి పత్రం ఇచ్చినా ఎందుకు స్వీకరించలేదని అడిగింది. మాధవపురి హిల్స్ రెసిడెంట్స్ సంక్షేమ సంఘానికి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారంటున్నారు. పోలీసులకు వినతి పత్రం ఇచ్చామంటున్నారు. ఎస్ఐ చర్య తీసుకోనప్పుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారా? రెసిడెంట్స్ సంక్షేమ సంఘం, ఆలయ కమిటీలతో కుమ్మక్కయ్యారు కాబట్టి, కట్టుకథలు చెబుతున్నారన్నారు. వెంటనే వెళ్లి అక్రమ నిర్మాణాలను కూల్చివేయమని, శాంతి భద్రతల సమస్య వస్తే డీజీపీని కలిసి పోలీసుల సాయం తీసుకోమని  ఈవోను ఆదేశించారు. 

 

ఆలయ కమిటీ తరఫు న్యాయవాది తాము చేస్తున్నది మంచి పనేనని, స్వార్థంతో చేయడంలేదని చెప్పగా దాతృత్వ కార్యక్రమాలు, మంచి పనులు చేస్తున్నామంటూ చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవుడు, దేవాలయం రాజ్యాంగానికి, చట్టానికి అతీతం కాదంది. దేవుడి విగ్రహం, దేవాలయం మైనర్లని కమిటీ తరఫు న్యాయవాది పేర్కొనగా దేవుడినీ రికార్డులోకి తీసుకురావాలని పిటిషనర్ను ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. దేవుడిని కూడా కేసులో జత చేయటంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: