ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో మాట్లాడుతూ ఏపీ రైతులపై వరాల జల్లు కురిపించారు. సీఎం జగన్ మాట్లాడుతూ రైతులకు మంచి చేయాలన్న ఆలోచనతో, తపన తాపత్రయంతో 13,500 రూపాయలు 5 సంవత్సరాల పాటు ఇచ్చే విధంగా కార్యక్రమం చేశామని చెప్పారు. దాదాపు 46 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందారని సీఎం జగన్ చెప్పారు. 
 
రైతులు ప్రీమియం కట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతోందని రైతుల తరపు నుండి ఏ మాత్రం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన పని లేదని అన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం కొరకు 2,100 కోట్ల రూపాయలు రైతుల తరపున భరిస్తున్నామని జగన్ చెప్పారు. రైతులకు వడ్డీ లేని రుణాలు అనే పథకాన్ని ప్రవేశపెట్టామని గర్వంగా చెబుతున్నానని అన్నారు. 
 
ఈ సంవత్సరం ఖరీఫ్ లో కానీ రబీలో కానీ రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఆ వడ్డీలను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించటం కొరకు 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని తెచ్చామని అన్నారు. ప్రతి రైతన్నకు తోడుగా ఉంటామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. రైతులందరూ బాగుండాలని రైతులందరికీ మంచి జరగాలని వైసీపీ ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. 
 
పశువులకు కూడా హెల్త్ కార్డులను జారీ చేస్తున్నట్టు చెపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇంకా మంచి జరుగుతుందని చెప్పారు. గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు జగన్ తెలిపారు. వ్యవసాయ నిపుణులను అందుబాటులో ఉంచుతామని రైతు భరోసా కేంద్రాల్లోనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా రైతు భరోసా కేంద్రాల్లోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: