మూడు రాజధానుల విషయంలో  చంద్రబాబునాయుడుతో పాటు తాజా మిత్రుడు పవన్ కల్యాణ్ కు బిజెపి తాజాగా పెద్ద షాకే ఇచ్చింది. శాసనమండలిలో జరిగిన చర్చలో బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.  సోము వీర్రాజు చేసిన ప్రకటనతో ఒక్కసారిగా సంచలనం రేపింది. సోము ఇటువంటి ప్రకటన చేస్తారని టిడిపి సభ్యులు ఏమాత్రం ఊహించలేదు.

 

జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కాన్సెప్టును అడ్డుకోవాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. జగన్ ను అడ్డుకోవటం తన వల్ల కాదని అర్ధమైన తర్వాత పెద్దన్నలాగ కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కమలంపార్టీతో జత కట్టిన జనసేన అధ్యక్షుడు కూడా చంద్రబాబు డిమాండ్ నే వినిపిస్తున్నారు.

 

టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి లాంటి వాళ్ళు జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న రచ్చ చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. రాజధానిని అమరావతి నుండి తరలిస్తే కేంద్రం జోక్యం చేసుకుని అసలు జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తుందనేంతగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 

తాజాగా ఢిల్లీకి చేరుకున్న పవన్ కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు. అంగుళం కూడా అమరావతి నుండి రాజధానిని కదల్చనీయమంటూ భీకరంగా ప్రతిజ్ఞలు చేస్తున్నారు. పైగా జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పిన విషయం అందరూ చూసిందే. ఇటువంటి నేపధ్యంలోనే  సోము మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణకు తాము మద్దతిస్తున్నట్లు చేసిన ప్రకటనతో అందరు షాక్ కు గురయ్యారు.

 

మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతిస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా చంద్రబాబును చెండాడుకునేశారు. మోడి పోస్టర్లను గాడిదలతో తొక్కిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.  రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు అభివృద్ధి మొత్తాన్ని అమరావతి కేంద్రంగానే ఉంచటాన్ని తప్పు పట్టారు. రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన తప్పు వల్లే ఇపుడు ఇంత రచ్చ జరుగుతోందంటూ మండిపోయారు. ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు, బండర్ పోర్టు అభివృద్ధి లాంటి అంశాలున్న కారణంగా పరిపాలనా వికేంద్రీకరణను బిజెపి స్వాగతిస్తున్నట్లు చెప్పి సంచలనం రేపారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: