అమ‌రావ‌తిపై ఉత్కంఠ‌త కొన‌సాగుతోంది. ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా, అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలు ఇవాళ్టికి 36వ రోజుకు చేరుకున్నాయి. మ‌రోవైపు వికేంద్రీక‌ర‌ణ‌కు ఏపీ ప్ర‌భుత్వం ముందుకు సాగుతుండ‌గా బీజేపీ మండ‌లిలో అడ్డుకుంటోంది. పార్టీ వ్యూహాన్ని ఖ‌రారు చేసేందుకు  అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. అనంత‌రం టీడీపీ యువ‌నేత నారా లోకేష్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

 

అమ‌రావ‌తిపై ప్ర‌భుత్వం దూకుడు, మూడు రాజ‌ధానుల అంశంపై ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేయాల‌ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. మండలిలో బిల్లులు చర్చకు రాకుండా అడ్డుకోవాలని టీడీపీ స‌భ్యుల‌కు తేల్చిచెప్పారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఎమ్మెల్యేల‌కు ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. దీంతో, ఇటు స‌భ‌లో, అటు మండ‌లిలో అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఎత్తులు-పై ఎత్తులు అన్న‌ట్లుగా స‌మీక‌ర‌ణాలు మారాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు.

 


అయితే, ఇదే స‌మ‌యంలో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గురువారం లోకేష్‌ పుట్టిన రోజు. అయితే ఆయన వేడుకలను జరుపుకోవడం లేదు. అమరావతి ఉద్యమానికి మద్దతుగా ప్రజల్లో ఉండాలని నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. బొకేలు, పూలు కొనే డబ్బులు ఉద్యమానికి విరాళంగా ఇవ్వాలని లోకేష్ నిర్ణయించారు. కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపేందుకు రావొద్దని లోకేష్ తెలిపారు.  కాగా, ప్ర‌స్తుతం వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలోనూ రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: