ఏపీ శాసనమండలిని సీఎం జగన్ రద్దు చేయబోతున్నారు అంటూ రెండు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మూడు రాజధానులు బిల్లు అసెంబ్లీలో విజయవంతంగా నెగ్గినా శాసనమండలిలో టిడిపి బలం ఎక్కువగా ఉండడంతో ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. ఇదే కాకుండా ఇకపై తీసుకునే నిర్ణయాలన్నీ ఇదే విధంగా అసెంబ్లీలో పాస్ అవ్వడం, మండలిలో వాటిని టిడిపి అడ్డుకునే అవకాశం ఉండడంతో ఆలోచనలో పడ్డ జగన్ మండలిని రద్దు చేసేందుకు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. 


అభివృద్ధి, వికేంద్రీకరణ , సీఆర్డీయే రద్దు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. కానీ అకస్మాత్తుగా రూల్ నెంబర్ 71 టిడిపి ప్రవేశపెట్టడంతో శాసనమండలిని రద్దు చేయడమే మంచిదనే ఆలోచనలో జగన్ ఉన్నారు. అయితే ఇక్కడే జగన్ కు ఓ సెంటిమెంట్ బాగా అడ్డు వస్తుండడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయం ఎవరికీ క్లారిటీ లేదు.


అసలు ఏపీ శాసనమండలి 1958లో ఆర్టికల్ 168 కింద జులై ఒకటో తేదీన ఏర్పాటయింది. ఆ తరువాత 1985 ఏప్రిల్ 30వ తేదీన మండలిని రద్దు చేస్తూ శాసనసభలో ఎన్టీఆర్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ తర్వాత మండలి కోసం 1990 జనవరి 22వ తేదీన మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ 1991 సంవత్సరంలో లోక్ సభ రద్దు కావడంతో ఆ విషయం పక్కన పడిపోయింది. కానీ 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మండలిని పునరుద్ధరించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేశారు. 


ఆయన ఒత్తిడితోనే 2005 డిసెంబర్ 15వ తేదీన ఏపీ శాసనమండలి పునరుద్ధరణ లోక్ సభ ఆమోదం తెలిపింది. 2005 డిసెంబర్ 20న రాజ్యసభ కూడా ఆమోదం చెప్పింది. దీంతో 2006 జనవరి 10వ తేదీన ఏపీ శాసనమండలి పునరుద్ధరణకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 2007 మార్చి 30వ తేదీన శాసన మండలి ఏర్పాటైంది. ఈ విధంగా ఎప్పుడో రద్దయిపోయిన శాసనమండలి తిరిగి కష్టపడి పునరుద్ధరించిన రాజశేఖర్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు జగన్ శాసనమండలిని రద్దు చేసే అవకాశమే లేదని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. జగన్ కు ఉన్న ఈ సెంటిమెంట్ తమకు ఆయుధం లా మారుతోందని ఆ పార్టీ ఆనందంగా ఉంది. అయితే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనకాడని జగన్ శాసనమండలి విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: